accidents
క్రైమ్

Road Accidents: రహదారులపై నెత్తుటేరులు.. రోజుకు సగటున ఎన్ని ప్రమాదాలంటే?

Road Accidents: రాష్ట్రంలో రహదారులు నెత్తురోడుతున్నాయి. రోజుకు సగటున 56 ప్రమాదాలు జరుగుతుంటే 18 మంది చొప్పున‌ మృత్యువాత పడుతున్నారు. 55మందికి పైగా గాయపడుతున్నారు. వీరిలో కొందరు శాశ్వతంగా అంగవైక‌ల్యానికి గుర‌వుతున్నారు. ఫలితంగా ప్రతీ సంవత్సరం వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపటం, నిర్లక్ష్యం ఈ విషాదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఆయా రోడ్లలోని ఇంజినీరింగ్ లోపాలు, అవసరమైన చోట కనిపించని హెచ్చరిక బోర్డులు, సిగ్నల్ జంపింగులు కూడా దుర్ఘటనలకు దారి తీస్తున్నాయి. కొన్ని చర్యలు తీసుకోవటం ద్వారా ప్రమాదాలను తగ్గించే అవకాశాలున్నా, ఎవ్వరూ దీని గురించి పట్టించుకున్న పాపానికి పోవటం లేదు. ఫలితంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి చేరే వరకు బిక్కు బిక్కుమంటూ కాలం గడపాల్సిన దుస్థితి నెలకొంది.

రోడ్ల‌న్నీ ర‌ద్దీగానే..

రాష్ట్రంలో జాతీయ రహదారులు 4,983 కిలోమీటర్లు ఉండగా, పంచాయ‌తీరాజ్ పరిధిలో 68,687 కిలోమీటర్లు, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 27,502 కిలోమీటర్ల మేర రహదారులున్నాయి. 2024, డిసెంబర్‌ నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఉన్న వాహనాల సంఖ్య కోటీ 72 లక్షల 31వేల 633. ఇవి కాక నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి మన స్టేట్ మీదుగా ప్రయాణం చేసే వాహనాల సంఖ్య లక్షన్నరకు పైగానే ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఏ రోడ్డు చూసినా నిత్యం వచ్చి పోయే వాహనాలతో రద్దీగా కనిపిస్తున్న‌ది. ఇటువంటి పరిస్థితుల్లో అతి వేగం ప్రాణాంతకమవుతున్న‌ది. ముఖ్యంగా లారీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, కార్లు నడుపుతున్న వారిలో చాలా మంది గాలితో పోటీ పడుతున్నారు. ఎంత వీలైతే అంత వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని యాక్సిలేటర్లను తొక్కి పెడుతున్నారు. ముందు వెళుతున్న వాహనాలను ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయకూడదన్న నిబంధన ఉన్నా ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్నట్టయితే ఇండికేటర్ వేయటం ద్వారా వెనక వచ్చే వాహనదారులను అలర్ట్ చేయాల్సి ఉన్నా ప‌ట్ట‌దు! ఇటువంటి పరిస్థితుల్లో చిన్నపొరపాటు జరిగినా రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.

అక్కరకు రాని స్పీడ్ గన్లు

యాక్సిడెంట్లను నివారించటానికి ప్రభుత్వం జాతీయ, రాష్ట్ర‌ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే ప్రాంతాల్లో స్పీడ్ గన్లను ఏర్పాటు చేసింది. అయితే, వీటి వల్ల పెద్దగా ప్రయోజనం కలగటం లేదు. దీనికి ప్రధాన కారణం వాహనాలను నడుపుతున్న వారు ఈ స్పీడ్ గన్లను ఏమాత్రం పట్టించుకోక పోతుండటం. అధికారులు కూడా పరిమితికి మించిన వేగంతో వెళుతున్న వాహనాలపై కేసులు నమోదు చేసి, చలాన్లు వేసి చేతులు దులుపుకొంటున్నారు. అలా కాకుండా పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకుని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటే కొంతలో కొంతైనా పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇలా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి కోర్టుల్లో హాజరు పరిచి జ్యుడిషియల్ రిమాండుకు తరలించినపుడే వారిలో భయం వస్తుందని జనం అభిప్రాయ పడుతున్నారు.

మద్యం మత్తులో..

మద్యం మత్తులో డ్రైవింగ్ ప్రమాదాలకు మరో ప్రధాన కారణంగా కనిపిస్తున్న‌ది. ఏ రోడ్డులో వెళ్లినా వాటి పక్కన దాబాలు, హోటళ్లు కనిపిస్తుంటాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న యాక్సిడెంట్లను నివారించటానికి వీటిల్లో మద్యం విక్రయాలు జరపవద్దన్న ఉత్తర్వులున్నాయి. మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే, దీనిని పాటిస్తున్న దాబాలు, హోటళ్ల సంఖ్య పదుల్లో కూడా ఉండటం లేదు. డబ్బు సంపాదనే లక్ష్యంగా దాబాలు, హోటళ్ల యాజమాన్యాలు యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుపుతున్నాయి. ఇదంతా తెలిసి కూడా స్థానిక పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతూ ఎలాంటి చర్యలు చేపట్టటం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగినపుడో.. అధికారుల నుంచి హెచ్చరికలు వచ్చినపుడో తూతూ మంత్రంగా దాడులు జరిపి కేసులు నమోదు చేస్తున్నారు తప్పితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

రాత్రుళ్లు మొత్తం మద్యం అమ్మకాలు

జాతీయ, రాష్ట్ర‌ రహదారులకు ఇరువైపులా ఉండే ప్రతీ గ్రామం వద్ద వైన్ షాపులు కనిపిస్తాయి. రాత్రి 11 గంటలకు షాపులు మూసి వేయాల్సి ఉండగా చాలా మంది రాత్రుళ్లు మొత్తం అమ్మకాలు
సాగిస్తున్నారు. ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ కొందరు పోలీసులు వీరికి సహకరిస్తున్నారు. ఇక, సరిగ్గా నిద్ర లేకుండా డ్రైవింగ్ చేస్తుండటం, మలుపుల వద్ద హెచ్చరికల బోర్డులు ఉండక పోతుండటం, కార్లు నడుపుతున్న వారిలో చాలామంది సీటు బెల్టులు పెట్టుకోక పోతుండటం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించక పోతుండటం వద్ద కూడా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగి పోతుండటానికి కారణమవుతోంది.

ప్రజా రవాణా వ్యవస్థ సరిగ్గా లేక

ప్రజా రవాణా వ్యవస్థ సరిగ్గా లేక పోవటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పటిక సరైన బస్సు సదుపాయం లేని పల్లెలు రాష్ర్టంలో వందల సంఖ్యలో ఉన్నాయి. రోజుకు నాలుగు బస్సు ట్రిప్పులు కూడా ఊర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు రవాణా అవసరాలను తీర్చుకోవటానికి ప్రైవేట్ వాహనాలపై ఆధార పడుతున్నారు. ఇదే అవకాశంగా ఆటోలు, వ్యాన్లు, ట్రాక్టర్లు నడుపుతున్న వారు ఆదాయమే ముఖ్యమన్నట్టుగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.

Read Also: Maha Kumbh 2025: చివరి అంకానికి కుంభమేళా.. యూపీ సర్కార్‌కు మరో టాస్క్

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..