Ind vs Pak: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంతవేగంగా 9000 పరుగుల (9000 Runs) మైలురాయిని అందుకున్న తొలి ఓపెనర్‌గా (Opening Batsman) రోహిత్ ప్రపంచ రికార్డు సాధించాడు. హిట్‌మ్యాన్ ఈ ఫీట్‌ను కేవలం 181 ఇన్నింగ్స్‌లలో ఈ మైలు రాయి అందుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 197 ఇన్నింగ్స్‌లలో ఓపెనర్ గా 9వేల పరుగుల మైలురాయిని చేరగా ..తాజా మ్యాచ్ తో రోహిత్ ..సచిన్ రికార్డును బీట్ చేసి కొత్త రికార్డు నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన ఆరో ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. తన కెరీర్‌లో 270 వన్డేలు ఆడిన రోహిత్..48.89 సగటుతో 11049 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 32 సెంచరీలు ఉన్నాయి. ఇందులో మూడు డబుల్ సెంచరీలు కావడం విశేషం.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు వీరే..
సచిన్ టెండూల్కర్-15310, సనత్ జయసూర్య- 12740, క్రిస్ గేల్-10179,ఆడమ్ గిల్‌క్రిస్ట్- 9200,సౌరవ్ గంగూలీ- 9146,రోహిత్ శర్మ 9000.
టాస్ ఓడిపోవడంలో ప్రపంచ రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా భారత్ కోరుకోని ఓ రికార్డ్‌ను సృష్టించింది. పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా టాస్ వేయగా పాక్ కెప్టెన్ రిజ్వాన్ గెలిచాడు. దీంతో భారత్ వన్డే ఫార్మాట్‌లో వరుసగా టాస్‌లు ఓడిపోవడం ఇది 12వ సారి కావడం గమనార్హం. అంతకుముందు నెదర్లాండ్స్ జట్టు వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ కోల్పోయింది. ఇప్పుడు వరుసగా 12 సార్లు టాస్ ఓడిన భారత్ కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.