Ind vs Pak
స్పోర్ట్స్

Ind vs Pak: కింగ్ కోహ్లీ సెంచరీ.. పాకిస్థాన్‌కు చుక్కలు.. కోహ్లీ కొత్త రికార్డులు

  • బౌలర్లు భళా, అదరగొట్టిన గిల్, శ్రేయస్
  • 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

Ind vs Pak: నరాలు తెగే ఉత్కంఠ లేకున్నా, మ్యాచ్‌లో మలుపులు కానరాకున్నా, దాయాదుల పోరు అభిమానులకు ఏమాత్రం నిరాశ కలిగించలేదు. భారత్ సునాయాసంగా గెలిచినా, కింగ్ కోహ్లీ సెంచరీ మార్కు అందుకోవడం, అద్భుత షాట్లతో అలరించడంతో స్టేడియం హోరెత్తింది. అంతా కోహ్లీ నామస్మరణతో స్టేడియం దద్దరిల్లింది. సెంచరీ ముంగిట కొద్దిగా ఉత్కంఠ నెలకొన్నా తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో సెంచరీ మార్కు ఎలా అందుకోవాలో తెలిసిన కోహ్లీ ఒకే షాట్‌తో పూర్తి చేసి, పాకిస్థాన్‌పై భారత్‌కు విజయాన్ని అందించాడు. దీంతో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. దుబాయ్ వేదిక‌గా దాయాది పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజ‌యభేరి మోగించింది.

సెమీస్ బెర్త్ ఖాయమే

ఈ గెలుపుతో భార‌త్ సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్నట్లే. పాకిస్థాన్ నిర్ధేశించిన 242 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊది పడేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్, 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఈ టార్గెట్‌ని టీమిండియా 42.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) సెంచరీ సాధించగా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (56; 67 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (46; 52 బంతుల్లో 7 ఫోర్లు) అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు.

పాక్ ఆశలు గల్లంతు

ప్రారంభంలో రోహిత్ శర్మ (20; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడినా షహీన్ షా అఫ్రిది వేసిన అద్భుత యార్కర్‌కు క్లీన్ బౌల్డ్‌గా ఔటయ్యాడు. పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుల్‌దిష్‌ షా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కోహ్లీకిది వన్డేల్లో 51వ సెంచరీ. ఈ గెలుపుతో భారత్ దాదాపు సెమీస్‌ చేరగా పాక్ నాకౌట్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. టీమిండియా గెలుపులో సెంచరీతో కీలకపాత్ర పోషించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. తదుపరి మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.

రాణించిన రిజ్వాన్, షకీల్

టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా ఫకర్ జమాన్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇమాముల్ హక్, బాబర్ అజామ్ బ్యాటింగ్‌కు దిగారు. తొలి ఓవర్ వేయడంలో షమీ పూర్తిగా తడబడ్డాడు. షమీ వేసిన తొలి ఓవర్లో మొత్తం 6 పరుగులు రాగా అందులో 5 వైడ్స్ ఉన్నాయి. గతంలో వన్డేల్లో తొలి ఓవర్‌ పూర్తి చేసేందుకు ఇర్ఫాన్‌ పఠాన్‌, జహీర్‌ ఖాన్‌ కూడా 11 బంతులే తీసుకున్నారు. షమీ కూడా వన్డేల్లో తొలి ఓవర్‌ పూర్తికి అత్యధిక బంతులు విసిరిన బౌలర్‌‌గా ఈ చెత్త రికార్డును సమం చేశాడు. పవర్ ప్లేలో మరో బౌలర్ హర్షిత్ రాణా, షమీ ఇద్దరూ కుదురుగానే బౌలింగ్ చేశారు. పాక్ ఓపెనర్లు కూడా షాట్లకు వెళ్లకుండా ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఈ సమయంలో బ్యాట్ ఝళిపించిన బాబర్ అజామ్(23) వరుస ఫోర్లతో ఊపు మీదున్న సమయంలో హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి  వెనుదిరిగాడు. పదో ఓవర్‌లో పాకిస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఈ సమయంలో పవర్ ప్లే ఆఖరి ఓవర్ వేసిన కుల్దీప్ బౌలింగ్‌లో ఇమామ్(10) రెండో పరుగు చేసే ప్రయత్నంలో అక్షర్ పటేల్ వేసిన సూపర్ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పాక్ 52/2 స్కోరుతో పవర్ ప్లే ముగించింది. ఈ సమయంలో కెప్టెన్ రిజ్వాన్, మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ పాక్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తుండడంతో బౌండరీల రాక గగనమైంది. కానీ, వికెట్ మాత్రం ఇవ్వకుండా భారత స్పిన్నర్లను ఎదుర్కొంటూ మూడో వికెట్ భాగస్వామ్యంలో 104 పరుగులు జత చేశారు. మరోవైపు, జోరు పెంచిన సౌద్ షకీల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో రిజ్వాన్(46) పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అనంతరం బాగా ఆడుతున్న షకీల్(62) నూ పాండ్యానే పెవిలియన్ పంపాడు. ఇక ఆ తర్వాత పాక్ బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. తయ్యబ్ తాహిర్(4) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా సల్మాన్ ఆఘా(19), షహీన్ షా అఫ్రిది(0) ని కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. చివరలో ఖుష్ దిల్ షా (38) పోరాడడంతో పాకిస్థాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ పడగొట్టారు.

రికార్డుల కోహ్లీ

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు క్రికెట్ దిగ్గజం సచిన్ తర్వాత వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్‌గా ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన మూడో బ్యాటర్‌గా పలు రికార్డులు నమోదు చేశాడు.  వన్డేల్లో 14 వేల పరుగులు చేయడానికి సచిన్‌‌కు 350 ఇన్నింగ్స్‌‌లు అవసరమైతే, కోహ్లీ 287వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.

వన్డేల్లో అత్యధిక పరుగుల వీరులు

  1. సచిన్‌ టెండుల్కర్‌(ఇండియా)- 18426 రన్స్‌(452 ఇన్నింగ్స్‌)
    2. కుమార్‌ సంగక్కర(శ్రీలంక)- 14234 రన్స్‌(380 ఇన్నింగ్స్‌)
    3. విరాట్‌ కోహ్లి(ఇండియా)- 14000+ రన్స్‌(287 ఇన్నింగ్స్‌)*
    4. రిక్కీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా)- 13704 రన్స్‌(365 ఇన్నింగ్స్‌)
    5. సనత్‌ జయసూర్య(శ్రీలంక)- 13430 రన్స్‌(433 ఇన్నింగ్స్‌)

గతంలో మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌(156) పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ క్యాచ్‌ల రికార్డును కూడా కోహ్లీ(158) బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా నిలిచాడు. ఇక జాబితాలో ఓవరాల్‌గా శ్రీలంక స్టార్‌ మహేళ జయవర్దనే(218), ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌(160) టాప్‌ 2లో కొనసాగుతున్నారు.
వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లు

  1. విరాట్‌ కోహ్లీ- 158
    2. మహ్మద్‌ అజారుద్దీన్‌- 156
    3. సచిన్‌ టెండుల్కర్‌- 140
    4. రాహుల్‌ ద్రవిడ్‌- 124
    5. సురేశ్‌ రైనా- 102

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు