Murder: ఇటీవల హైదరాబాద్ లో వరుసగా మర్డర్లు జరుగుతున్నాయి. అదీ నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే బాహటంగా కత్తులతో దాడి చేసి చంపేస్తున్నారు. మొన్నటికి మొన్న మేడ్చల్ జాతీయ రహదారిపై కత్తులతో వెంటబడి సొంత అన్నను నరికిన ఘటనను చూశాం. ఇప్పుడు కూడా అదే తరహాలో బస్సులో ప్రయాణిస్తున్న కన్న తండ్రిని ఫాలో అయిన ఓ కొడుకు దిగగానే పొడిచి పొడిచి చంపాడు. రెండు కేసుల్లోను హత్య చేసింది సొంత కుటుంబ సభ్యులే. రెండు ఘటనల్లో చనిపోయిన వాళ్లు తాగుడు అలవాటు పడిన వాళ్లే కావడం గమనార్హం. రెండు దారుణాలు మేడ్చల్ పరిధిలోనే జరగడం మరో కోణం.
వివరాల్లోకి వెళ్తే…
సికింద్రాబాద్ లాలాపేట్ కు చెందిన ఆరెల్లి మొగిలి(45), అతని కొడుకు సాయి కుమార్ (25). వీరిద్దరూ ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో పనిచేస్తున్నారు. అయితే తాగుడుకు బానిసగా మారిన మొగిలి… నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తుండటంతో రోజు చేసేవాడు. తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన సాయి కుమార్… అతన్ని మట్టు బెట్టాలనుకున్నాడు. శనివారం మధ్యాహ్నం లాలాపేటలో బస్సు ఎక్కిన మొగిలి ఈసీఐ ఎల్ లో దిగాడు. బైక్ పై బస్సును వెంబడించిన సాయికుమార్… అతని తండ్రి దిగగానే తన వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణరహితంగా పొడిచాడు. అందరూ చూస్తుండగానే… తండ్రి అనే కనికరం లేకుండా 10.. 15 సార్లు పొడిచాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
‘నా’ అన్న వాళ్లనే నరికేస్తున్నారు!
కాగా, ఇటీవల మేడ్చల్ పరిధిలో వరుసగా హత్యలు జరుగుతుండటం అందరిని కలవరపెడుతోంది. ఇలాంటి హింసాత్మక ఘటనలు సినిమాల్లో జరిగినట్లు … నడిరోడ్డు మీద నరుక్కోవడం చూస్తుంటే మనుషులుగా మనం ఏటు పోతున్నాం అనిపిస్తుంది. అందులోనూ తోబుట్టువుల మీద, పెంచి పెద్ద చేసిన తండ్రి మీద ఇలా ప్రాణాలు తీసేంత కక్షలు ఎందుకు పెరుగుతున్నాయి. మరోవైపు ఈ రెండు వరుస ఘటనల్లో హతులు మద్యానికి బానిసై కుటుంబ సభ్యులని వారి ప్రవర్తనతో హింసిస్తున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మరీ ఎంత హింసిస్తే ఇంతకు తెగించి ఉంటారు అనే ఆలోచన కూడా రావొచ్చు. కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు కానీ… ఏదైనా నడి రోడ్డు మీద నా అనుకునే వాళ్లను నరకడమంటే…!
మనుషుల్లో అందులోనూ కుటుంబ సభ్యుల మధ్య ఇంతటి హింస ప్రవృత్తి చెలరేగడం సభ్య సమాజానికి మంచిది కాదు. ఏ కుటుంబంలో అయినా గోడవలు మాములే కానీ… అవీ హత్యల దాకా దారి తీస్తుండటం దురదృష్టకరం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఏవైనా చర్యలు చేపడితే మంచిది. మేధావులు, విద్యావేత్తలు పరిష్కార మార్గాలు వెతికితే బావుంటుంది. దీని సంగతి ఇలా ఉంటే… పోయిన వారం జరిగిన మర్డర్ లో ఘటన జాతీయ రహదారి మీదే జరిగింది… వాహనదారులు పక్క నుంచే వెళ్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. అంత ఆవేశంగా ఉన్న వాళ్లని ఆపడం ప్రాక్టికల్ గా సాధ్యకాకపోవచ్చు. సాహసం చేస్తే మన ప్రాణాలకే ముప్పు రావొచ్చు. కానీ నలుగురు కలసి మీదకి వెళ్లి ఉంటే… ఆ గుంపును చూసి నాలుగు పోట్లు తక్కువ పడి ఉండేవేమో. ఏమో ఆ స్థితిలో సదరు వ్యక్తి ప్రాణాలు నిలబడేవేమో. కనీసం ప్రయత్నం చేయకపోవడం బాధాకరం.
