SLBC Tunnel Accident: శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ వద్ద కొద్దిసేపటి ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ప్రాంతంలో… ప్రాజెక్టు పనులు చేస్తున్న సమయంలో పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎడమ వైపు ఉన్న సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఘటన జరిగింది. సొరంగం లోపల దాదాపు 40 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. టన్నెల్ పై భాగంలో మూడు మీటర్ల మేర కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవలే పనులను ప్రారంభించారు.
ప్రమాదం సంగతి తెలుసుకున్న సంబంధిత అధికారులు ఇప్పటికే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నలుగురు కార్మికుల్ని టన్నెల్ నుంచి బయటికి తీశారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాదం గురించి ఆరా తీశారు. అలాగే ఆయన ప్రత్యేక విమానంలో ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్తున్నారు.
ఎస్ఎల్ బీసీ పై కప్పు కూలిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా, దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత నాలుగు రోజుల క్రితమే ప్రాజెక్టు పనులను ప్రారంభమయ్యాయి. అయితే ఈ రోజు కూడా మార్నింగ్ షిఫ్ట్ లో భాగంగా పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే.