Falcon Scam Case: ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరిట అధిక లాభాలు ఆశ చూపి సుమారు రూ. 850 కోట్ల మేర మోాసానికి పాల్పడిన ఫాల్కన్ కంపెనీ పై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ మోసం కొద్ది రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు దర్యాప్లు చేసి ఫాల్కన్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయడంతో పాటు పలువుర్ని అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసును ఈడీకి అప్పగించారు.
అధిక లాభాలు ఆశ చూపి దేశవ్యాప్తంగా సుమారు రూ. 1700 కోట్లు వసూలు చేసిన ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు అందులో రూ. 850 కోట్ల వరకు మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. దాదాపు 7 వేల మంది దాకా మోసపోయినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈవోడబ్ల్యూ) అధికారులు ఈ కేసులో 19 మందిపై కేసుల నమోదు చేశారు. పవన్ కుమార్ ఓదెల, కావ్య నల్లూరి, అనంత్ అనే ముగ్గురిని అరెస్టు కూడా చేశారు.
అయితే, కేసు నమోదు కాగానే ఫాల్కన్ ఎండీ అమర్ దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈవో యోగేంద్ర సింగ్ తదితరులు దుబాయ్ పారిపోవడం గమనార్హం. వారికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
కాగా, మోసం చేసిన రూ. 850 కోట్ల డబ్బును నిందితులు విదేశాల్లోని షెల్ కంపెనీలకు తరలించినట్లు తెలుస్తోంది.