- పరికి చెరువు ఆక్రమణల తొలగింపు
- నోటరీలు చేస్తూ స్థానిక నేత భూదందా
- తెలియక కొన్నామంటూ బాధితుల ఆవేదన
- ఎఫ్‌టీఎల్ పరిధి కబ్జాలపై హైడ్రా నజర్
- ఆక్రమణలపై లోతుగా విచారణ జరుపుతున్న హైడ్రా
- నివాసముంటున్న ఇళ్ల జోలికెళ్లమని క్లారిటీ
Hydra: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని పరికి చెరువు (Pariki Lake)లో ఆక్రమణలను హైడ్రా బృందాలు తొలగించాయి. పరికి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న రెండు కట్టడాలతో పాటు పునాదుల దశలో ఉన్న మరో రెండు నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా (Hydra) వెల్లడించారు. పరికి చెరువు 60 ఎకరాలకు పైగా ఉండేదని, ఇప్పటికే చాలా వరకు కబ్జా అయినట్లు ఇటీవలే పరికి చెరువు పరిరక్షణ సమితి హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ స్థానిక నాయకుడిగా చెలామణీ అవుతున్న బాలకృష్ణ అనే వ్యక్తి ప్రభుత్వ భూమితో పాటు చెరువులోని ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలోని భూమిని ప్లాట్లుగా నోటరీలు చేస్తూ విక్రయిస్తున్నారని సమితి ప్రతినిధులు ఫిర్యాదు చేసినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. కొనేవాళ్లు, అమ్మేవాళ్లు ఇలా ఇరుపక్షాల ఆధార్ కార్డుల ఆధారంగా నోటరీ చేసి బాలకృష్ణ (Balakrishna) అతని అనుచరులు ఇక్కడ దందాలు చేస్తున్నారంటూ ఫిర్యాదులందినట్లు హైడ్రా పేర్కొంది. అక్కడ పాఠశాల మైదానం పేరుతో వెయ్యి గజాలకు పైగా బాలకృష్ణ అక్రమించారని, మైదానంలో వెలిసిన నిర్మాణాలు కూడా అక్రమమని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పరికి చెరువు పరిధిలో జరుగుతున్న కబ్జాలన్నిటిపైనా హైడ్రా పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాతే క్షేత్ర స్థాయి చర్యలకు వెళ్లినట్లు హైడ్రా వెల్లడించింది.
ఆక్రమణలుగా నిర్థారించుకున్నాకే
రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులతో పరిశీలించిన అవి అక్రమమేనని నిర్థారించుకున్న తర్వాతే ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణ దశలో వాటిని గుర్తించి గురువారం కూల్చివేతలను చేపట్టినట్లు హైడ్రా తెలిపింది. పరికి చెరువుకు ఆనుకుని ఉన్న భూదేవి, షిరిడీ హిల్స్ వైపు నుంచి ఆక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే జనం నివాసముంటున్న ఇళ్ల జోలికి వెళ్లకుండా, నిర్మాణ దశలో ఉన్న వాటినే తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. బతుకుదెరువు కోసం వచ్చి, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, తక్కువ ధరకు వస్తున్నదని, స్థానిక నాయకుడికి డబ్బులు చెల్లించి నోటరీ మీద కొనుగోలు చేశామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 50 గజాల స్థలాన్ని రూ.15 లక్షలకు కొనుగోలు చేసినట్లు, తక్కువ ధరకు దొరుకుతోందన్న ఆశతో కొనుగోలు చేశామని, ఆ స్థలం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తోందని తమకు తెలియదని బాధితులు వాపోయారు. అనీల్ రావు అనే వ్యక్తి తనదని చెప్పి, ప్రభుత్వ భూమిని బాలకృష్ణ ద్వారా ప్లాట్లుగా అమ్మకాలు చేస్తున్నట్టు పరికి చెరువు పరిరక్షణ సమితి ప్రతినిధులు చేసిన ఫిర్యాదుపైనా లోతుగా విచారణ జరుపుతుందని హైడ్రా వెల్లడించింది.