Governor On Jagan Security
ఆంధ్రప్రదేశ్

YS Jagan Security: జగన్‌కు సెక్యూరిటీ తొలగింపుపై ఆశ్చర్యపోయిన గవర్నర్!

  • తక్షణమే పరిశీలించి, విచారణ జరిపిస్తాం
  • వైసీపీ నేతలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హామీ
  • వైఎస్ జగన్ భద్రతకు ప్రభుత్వానిదే బాధ్యత
  • మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతపై ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు మిర్చియార్డు పర్యటన సందర్భంగా జగన్‌కు భద్రత కల్పించలేదని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వైసీపీ నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి, జగన్ రక్షణపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని గవర్నర్‌కు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్‌కు ఇప్పటి వరకూ ఉన్న జడ్‌ ప్లస్‌ భద్రతను పోలీసులు తొలగించారు. జగన్ పర్యటనలో యూనిఫామ్‌తో ఒక్కరంటే ఒక్క కానిస్టేబుల్‌ కూడా అక్కడ లేరు. ఆయన భద్రతకే ముప్పు కలిగించేలా పోలీసులు వ్యవహరించారు. అందుకే జగన్‌కు రక్షణ కల్పించాలని, చట్టం తన పని తాను చేసేలా చూడాలని గవర్నర్‌‌కు నివేదించాం. జగన్‌కు పోలీసులు భద్రత తొలగించడంపై గవర్నర్‌ ఆశ్చర్యపోయారు. తక్షణమే దీన్ని పరిశీలిస్తామని, విచారణ జరిపిస్తామని కూడా హామీ ఇచ్చారు. మా విజ్ఞప్తిపై గవర్నర్‌ స్పందించిన తీరు సంతృప్తికరంగా ఉంది. ఇది పూర్తిగా పోలీస్‌ వైఫల్యమే అని వివరించాం. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి. జగన్‌కు ఏ మాత్రం సెక్యూరిటీ ఇవ్వొద్దని గుంటూరు ఐజీ, ఎస్పీకి ప్రభుత్వంలోని పెద్దలు సూచించినట్లు మాకు సమాచారం ఉంది. అయితే ఏదైనా జరిగితే దానికి ఐజీ, ఎస్పీలు బాధ్యులు కారా? చట్టాలను అమలు చేయాల్సిన ఉన్నతాధికారులే ఇలా వ్యవహరించడం ఎంతవరకూ న్యాయం? అని కూటమి ప్రభుత్వాన్ని బొత్స ప్రశ్నించారు.

Also Read:  TDP vs YCP: పొలిటికల్ ఘాటు ; మిర్చి రేటుపై వైసీపీ, టీడీపీ మైలేజ్ ఫైట్

మేం ఎప్పుడూ చేయలేదే!

జగన్‌‌కు జడ్‌ ప్లస్‌ భద్రతను తీసేయడం చూస్తే, ఈ ప్రభుత్వం ఆయన్ను ఏం చేయాలని అనుకుంటుందో అర్థం కావట్లేదు. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు ఇలా వ్యవహరించలేదు. కానీ, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో, ఒక దురుద్దేశంతోనే భద్రతను తొలగించింది. ఎన్నికల కోడ్‌కు, జగన్ బందోబస్త్‌కు సంబంధం లేనే లేదు. మాజీ సీఎంకు జడ్‌ ప్లస్‌ భద్రత అనేది అన్ని సందర్భాల్లోనూ వర్తిస్తుంది. ఒకవేళ, ఎన్నికల కోడ్‌ ఉంటే జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించడం కుదరదని ముందుగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? ఇదే ఎన్నికల కోడ్‌ విజయవాడలో జరిగిన సంగీత విభావరీ సందర్భంగా ఎందుకు అమలు చేయలేదు? రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మిర్చియార్డుకు జగన్‌ వెళ్తే ఎన్నికల కోడ్‌ పేరుతో ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు. అనుమతి లేకుండా మిర్చియార్డుకు వెళ్ళారంటున్న పోలీసులు ముందురోజు వైసీపీ నేతలు సమాచారం ఇచ్చినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? జగన్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు కదా? దాదాపు రూ.20 వేలు ఉన్న క్వింటా మిర్చి నేడు రూ.10 వేల దిగువకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రైతులతో మాట్లాడి, భరోసా ఇవ్వడానికి వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేస్తారా? ఈ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయ్యింది. రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చింది కూడా రైతులకు ఇవ్వలేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మా హయంలో విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఉన్నాం. నేడు ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. రైతులను దళారీలు దోచుకుంటున్నారు. ఎరువులు, విత్తనాల ధరలను ఎవరూ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదు. వీటన్నింటి వల్ల రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారింది అని ప్రభుత్వంపై బొత్స విమర్శలు గుప్పించారు. గవర్నర్‌తో భేటీ అయిన వారిలో బొత్సతో పాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

 

Also Read: వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.. మాజీ సీఎం జగన్ ఆరోపణ..!

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్