భారత్ తో కీలక మ్యాచ్ కు ముందు పాక్ కు షాక్
తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. తొలి మ్యాచ్ లో కండరాల గాయానికి గురైన జట్టు స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సందర్భంగా ఫఖార్ గాయపడ్డాడు. ప్రారంభ ఓవర్లలోనే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతను పరుగెత్తి బంతిని ఆపేందుకు ప్రయత్నించి కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో ఫఖార్ జమాన్ గాయం కారణంగా 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా కేవలం 24 పరుగులే చేసి పేలవంగా ఔటయ్యాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య నివేదిక ప్రకారం పఖార్ మ్యాచ్ ఆడే ఫిట్ నెస్ కోల్పోయాడు. అతనికి విశ్రాంతి కల్పించాలని వైద్యులు సూచించడంతో అతను కొంతకాలం మైదానానికి దూరం కానున్నాడు. దీంతో పాకిస్తాన్ జట్టు ఆడే తదుపరి మ్యాచ్‌లకు ఫఖర్ జమాన్ అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంలో ఇమాముల్ హఖ్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంపిక చేసింది.
ఈ ఆదివారం (ఫిబ్రవరి 23) భారత్ తో కీలక మ్యాచ్ కు ముందు ఫఖార్ సేవలు కోల్పోవడం పాకిస్థాన్ కు తీవ్ర దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే భారత్ పై పఖార్ కు మాత్రమే మెరుగైన రికార్డుంది. గత ఎడిషన్ 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పఖార్ సెంచరీతో పాకిస్థాన్ చాంపియన్ గా నిలిచింది. అప్పుడు ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఫఖార్ 106 బంతుల్లో 3 సిక్సర్లు, 12 ఫోర్లతో 114 పరుగులతో హోరెత్తించాడు. పఖార్ సెంచరీతో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 339 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడించింది. పేసర్ ఆమిర్ భారత టాపార్డర్ ను దెబ్బ కొట్టారు. ఈ క్రమంలో టీమిండియా 150 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది. అంతేకాదు టీమిండియా అంటే పఖార్ రెచ్చి పోతాడు.
అలాంటి బ్యాటర్ ఇప్పుడు ఆదిరవారం భారత్ తో జరగనున్న కీలక మ్యాచ్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేకపోవడం పాకిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బ కానుంది. అంతేకాదు భారత్ పై మెరుగైన సగటు (46కు పైగా) కలిగిన బ్యాటర్ కూడా పఖార్ మాత్రమే. పాకిస్థాన్ కెప్టెన్ రిజ్వాన్, బాబర్ సహా ఎవరికీ భారత్ పై మెరుగైన రికార్డు లేకపోవడం గమనార్హం.