Delhi Railway Station Stampede: కుంభమేళా (Maha Kumbh) భక్తుల రద్దీ కారణంగా ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో (Delhi Railway Station) జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు (Delhi High Court) కీలక ప్రశ్నలు సంధించింది. ఒక కోచ్‌లో గరిష్ఠంగా ప్రయాణించే ప్యాసింజర్ల సంఖ్యపై పరిమితి ఉన్నప్పటికీ, అంతకుమించి అధిక టికెట్లు ఎందుకు విక్రయించారని భారతీయ రైల్వేస్‌ను (Indian Railways) న్యాయస్థానం నిలదీసింది. ‘‘ఒక కోచ్‌లో గరిష్ఠంగా ఎంతమంది ప్రయాణించాలో మీరే నిర్ణయించినప్పుడు మరి ఎందుకు అదనపు టికెట్లు అమ్మారు?. అది సమస్యే కదా?. రైల్వేస్ చట్టంలోని సెక్షన్ 57 ప్రకారం ఒక కంపార్ట్‌మెంట్‌లో ఎంతమంది ప్యాసింజర్లు ప్రయాణించాలో యాజమాన్యం నిర్ణయించాలి. అంతఃకరణ శుద్ధితో సులభమైన ఈ అంశాన్ని ఆచరించే ఉంటే ఈ ప్రమాదం తప్పి ఉండేదేమో. రద్దీగా ఉండే రోజుల్లో రైళ్ల సమయానుగుణంగా నడుస్తుంటే ప్యాసింజర్ల సంఖ్య సామర్థ్యాన్ని పెంచినా ఫర్వాలేదు. కానీ, ఈ నిబంధనను విస్మరించడాన్ని చూస్తుంటే నిర్లక్ష్యంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది’’ అని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు గెడెలతో కూడిన డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట తరహా విషాదాలను అరికట్టడానికి తీసుకున్న చర్యలు ఏమిటో తెలియజేయాలంటూ దాఖలైన ఓ వ్యాజ్యంపై బుధవారం విచారణ సందర్భంగా బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటన నేపథ్యం ఆధారంగా ‘ఆర్థ్ విధి’ అనే ఓ ఆర్గనైజేషన్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. రైల్వేస్ చట్టంలోని పలు నిబంధనలను అమలు చేయకపోవడంతోనే పలు విషాదాలు చోటుచేసుకుంటున్నాయని, దీనికి ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనే ఒక ఉదాహరణ అని పేర్కొంది. నిర్వహణ లోపం, విధుల్లో నిర్లక్ష్యం, పాలనా యంత్రాంగం దారుణ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. భారతీయ రైల్వేస్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వాదనలు వినిపించారు. ఇలాంటి ఘటనల విషయంలో చూస్తూ కూర్చోబోమని న్యాయస్థానానికి చెప్పారు. పిటిషన్‌లో పేర్కొన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని కోర్టుకు వివరించారు. చట్టానికి కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. పిటిషనర్ లేవలెత్తిన అంశాలను రైల్వేస్ పరిగణనలోకి తీసుకొని, పరిశీలిస్తుందని చెప్పారు. నిబంధనల అమలు అంశాన్ని రైల్వే బోర్డు చూసుకుంటుందని కోర్టుకు తెలిపారు. దీంతో, నిబంధనల నిర్లక్ష్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ రైల్వే, రైల్వే బోర్డులు స్పందన తెలియజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 26కు వాయిదా వేసింది.
ఇదీ చదవండీ
RTI : ‘సమాచారం’ ఖాళీ.. పెండింగ్‌లో 17 వేల అప్పీళ్లు