rti
సూపర్ ఎక్స్‌క్లూజివ్

RTI : ‘స‌మాచారం’ ఖాళీ.. పెండింగ్​లో 17 వేల అప్పీళ్లు

RTI : సమాచార హక్కు చట్టం (RTI) అమలు కోసం ఉద్దేశించిన క‌మిష‌న‌ర్ల నియామకం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో తక్షణం నియమించేలా చర్యలు తీసుకుని, వచ్చే మార్చ్ నెల నాలుగ‌వ తేదీక‌ల్లా రిపోర్టు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశించింది. అయితే నియామక ప్రక్రియపై కొంతమేర ప్రయత్నాలు జరిగినా మధ్యలోనే ఆగిపోయాయి. తెలంగాణ (Telanagan) రాష్ట్రం ఏర్పాటు అయ్యాక బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం చాన్నాళ్లు సమాచార కమిషనర్ల పోస్టులను ఖాళీగా పెట్టింది. అప్పట్లో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోర్టు ద్వారా ఒత్తిడి తేవటంతో ఎట్టకేలకు 2017లో భర్తీ చేసింది. అప్పుడు ప్రధాన కమిషనర్‌తోపాటు ఐదుగురు కమిషనర్లను నియమించింది.


రెండేళ్లుగా పోస్టులన్నీ ఖాళీ

రాష్ట్రంలో స‌మాచార‌ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ 2020 ఆగస్టు 24వ తేదీన ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. అప్పటి నుంచి మూడేళ్ల పాటు మరో కమిషనర్ ఇన్‌చార్జ్‌ ప్రధాన కమిషనర్‌గా కొనసాగారు. ఆయనతో పాటు మిగిలిన క‌మిష‌న‌ర్లు కూడా 2023వ సంవత్సరం ఫిబ్రవరి 24న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. అప్పటి నుంచి రెండేళ్లుగా సమాచార హక్కు చట్టం ఖాళీగా ఉంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. 280 మంది అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు. కానీ ఈలోగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటం, కోడ్ రావటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

400 మంది ద‌ర‌ఖాస్తు

ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరోసారి నోటిఫికేషన్ ఇవ్వటంతో ఏకంగా నాలుగు వందల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అఖిల భారత సర్వీసులకు చెందిన రిటైర్డ్ అధికారులు, రాష్ట్ర రిటైర్డ్ అధికారులు, అడ్వొకేట్లు, జర్నలిస్టులు, ఇలా వివిధ రంగాలకు చెందినవారు ఉన్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ఈ సంఖ్య దాదాపు ఏడు వందలు దాటింది. అయితే ప్రభుత్వ స్థాయిలో జరిగిన వడపోతలో ఈ సంఖ్యను బాగా కుదించినట్లు సమాచారం. అన్ని విధాలా అర్హులైన ఒక యాభై మంది పేర్లను మాత్రమే సంబంధిత అధికారులు ఖరారు చేసినట్లు తెలిసింది. అందులోనూ వివిధ సమీకరణాలను బేరీజు వేసి, వ‌డ‌పోసిన ముఫ్పై ఐదు మంది పేర్ల‌తో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైనల్ లిస్టును సిఫారసు చేసినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఏడుగురు కమిషనర్లను నియమిస్తే ఒక్కో పోస్టుకు ఐదుగురు పోటీలో ఉంటారని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం ఎంతమందికి అవకాశం ఇస్తుంది? ఎప్పుడు నియామ‌కాలు ఉంటాయి? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ కోడ్ ఉండటం, సీఎం, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేతలతో ఒక సమావేశం నిర్వహించాల్సి ఉండటం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ కారణాలతో మరింత సమయం కావాల‌ని సుప్రీంకోర్టును రాష్ట్ర స‌ర్కార్ కోరే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది.


17 వేల అప్పీళ్లు పెండింగులోనే

సమాచార హక్కు క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంతో 17 వేల అప్పీళ్ళు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ సంఖ్య 15 వేలు ఉంటే, ఇప్పుడు మరో రెండు వేలు పెరిగింద‌ని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాచారం కోరటం ప్రజల ప్రాథ‌మిక హక్కు అని, ఒక వేళ సరైన సమాచారం రాకపోతే అప్పీల్ పై కమిషన్‌ను ఆశ్రయించే అవకాశం పౌరులకు ఉంటుందని ఆయన తెలిపారు. గత రెండేళ్లుగా సమాచారం హక్కు చట్టం క‌మిష‌న‌ర్ల ప‌ద‌వులు ఖాళీగా ఉండటంతో ఆ చట్టం మౌలిక ఉద్దేశ‌మే దెబ్బతింటున్న‌ద‌ని స్వచ్ఛంద కార్యకర్తలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

KCR: పాస్ పోర్టు ఆఫీసుకు మాజీ సీఎం కేసీఆర్

Hari Hara Veera Mallu: ‘ఛావా’కు మించిన సినిమా

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?