కొన్ని కాంబినేషన్‌లలో సినిమా అనౌన్స్ కాగానే సగం సినిమా సక్సెస్ అయినట్లుగా వైబ్ వచ్చేస్తుంది. కానీ కొన్ని కాంబినేషన్‌లలో సినిమాలు అనౌన్స్ కాగానే, అంతా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అసలు ఇదేం కాంబినేషన్, ఆ యాక్టర్, ఈ యాక్టర్‌తో ఎలా చేస్తున్నాడు అంటూ అంతా చర్చలు పెట్టేస్తారు. సరిగ్గా అలాంటి చర్చలు, మాటలే విన్నానని అంటున్నాడు కమెడియన్ ధనరాజ్. తొలిసారి దర్శకత్వం చేస్తూ ధనరాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రామం రాఘవం’. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా పృథ్వీ పోలవరపు నిర్మిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ సముద్రఖని ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనరాజ్ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.
Also Read- Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?
ధనరాజ్ మాట్లాడుతూ.. ఆరిపాక ప్రభాకర్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఆయన ఈ సినిమాకు ఎంతగా కోపరేట్ చేశారంటే, ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటాను. పృథ్వీ పోలవరపు సహకారం మరిచిపోలేను. ‘రామం రాఘవం’ చిత్ర కథ ప్రేక్షకులని ఏడిపించేలా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే, కావాలని ఏడిపించడానికి మాత్రం ఈ సినిమా చేయలేదు. కానీ, ఇందులోని ప్రతి సన్నివేశం ప్రతి కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో జరిగే ఉంటుంది. సముద్రఖని వంటి గొప్ప నటుడు కమెడియన్ ధనరాజ్‌కి ఫాదర్‌గా నటించడం ఏంటి? అని చాలా మంది కామెంట్స్ చేశారు, చేస్తున్నారు. సముద్రఖని అంతటి ఆయనకి నాకు ఫాదర్‌గా నటించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మిగిలిన వాళ్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారనేది నాకు అర్థం కావడం లేదు. కంటెంట్‌ని చూసి మాట్లాడండి. ఈ సినిమా రిలీజ్ అవుతున్న ఫిబ్రవరి 21న మా రెండేళ్ల కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారని కోరుకుంటున్నాను అని ధనరాజ్ చెప్పుకొచ్చారు.
ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసే వ్యక్తిత్వం ధనరాజ్ అన్నది. ట్యాలెంట్ ఉన్న వారికి ఏదో విధంగా ఛాన్స్ రావాలని ఆయన సహాయం చేస్తుంటారు. సముద్రఖని వంటి గొప్ప నటుడు, దర్శకుడు ఈ సినిమాలో నటించారంటే, అందులోనూ ధనరాజ్ అన్నకి తండ్రిగా చేశారంటేనే ‘రామం రాఘవం’ ఎంత మంచి చిత్రమో అర్థమవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి, పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. ఏ సినిమా కథనైనా ఓ నాలుగైదు గంటలు విన్న తర్వాత ఓకే చేస్తాం. కానీ ఈ సినిమాని అలా ఓకే చేయలేదు. ఈ కథ జెన్యూన్ అని నమ్మిన తర్వాతే ఒప్పుకున్నా. ‘జెండాపై కపిరాజు’ షూటింగ్‌లో మొట్టమొదటిసారి ధనరాజ్‌ని చూశాను. ధనరాజ్ ఈ చిత్ర కథని రెండు లైన్స్‌లో చెప్పినప్పుడే బలమైన కథ అనిపించింది. కచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే చిత్రమవుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో పాటు హాజరైన పలువురు ప్రముఖులు మాట్లాడారు.