champions-trophy
స్పోర్ట్స్

Champions Trophy: ‘చాంపియన్’ ఫేవరెట్ భారత్

Champions Trophy: ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో ఒకటే హాట్ టాపిక్. క్రికెట్ విశ్లేషకులైనా.. మాజీ ప్లేయర్ల  నోటి నుంచి వస్తున్నది ఒకటే మాట. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఈ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్ అని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఎవరు ఎక్కడ చర్చించినా.. నిజమే మనం వన్డే ఫార్మాట్ లో తోపుతీరున ఆడుతున్నాం. ఇటీవలే బజ్ బాల్ క్రికెట్ ఆడే ఇంగ్లండ్ ను 3-0 తేడాతో వైట్ వాష్ చేసాం.. ఇప్పటివరకు ఫాంలో లేరనుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో..కింగ్ కోహ్లీ షాందార్ హాఫ్ సెంచరీతో మళ్లీ రిథమ్ అందుకున్నారు. యువ బ్యాటర్..జట్టు వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ వన్డే ఫార్మాట్ లో రఫాడిస్తాడు. మొన్నటివరకు షార్ట్ బాల్ వీక్ నెస్ తో కనిపించిన శ్రేయస్ అయ్యర్ ఇయ్యరమయ్యర బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నడు.. ఇక ఆ తర్వాత లోకేశ్ రాహుల్.. మిగిలిన ఫార్మాట్లో ఎలా ఉన్నా వన్డేల్లో మాత్రం తీస్ మార్ ఖాన్ లెక్క.. ఐదో స్థానంలో దిమ్మతిరిగే బ్యాటింగ్ చేస్తున్నడు.. ఆ తర్వాత అక్షర్ పటేల్ , హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా .. వీళ్లు పవర్ ప్లేలోనైనా బౌలింగ్ చేయగలరు.. 4 వ నంబరు నుంచి 8 వ నంబరు వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలరు.. ఇక 9లో అర్షదీప్, 10లో షమీ, 11లో కుల్దీప్ ఇదీ.. స్థూలంగా టీమిండియా ఎలెవన్.. పేపరు మీద పేర్లు చూస్తుంటేనే గుండెలు గుభిల్లుమంటున్నాయి. అంతేకాదు.. దాదాపు 2023 ప్రపంచకప్ ఫైనల్ చేరిన జట్టు.. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న జట్టు సేమ్ టూ సేమ్.. అప్పటి మాదిరిగానే ఆడితే మనోళ్లకు తిరుగులేనట్లే. అందరూ చెప్పుకుంటున్నట్లుగా మనం హాట్ ఫేవరెట్లమే.

మన లెవలే వీర లెవలు..

చాంపియన్స్ ట్రోఫీలో ఆడే మిగిలిన జట్లతో పోల్చుకుంటే టీమిండియాకు ఉన్న బ్యాటింగ్ డెప్త్.. మన స్ట్రెంట్.. మ్యాన్ టూ మ్యాన్ ఇలా ఎలా చూసుకున్నా వేరె లెవెల్ .. ఇప్పుడు మన టీమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందటే మన ఎక్స్ ప్రెస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటును కూడా అధిగమించేలా కనిపిస్తోంది. బుమ్రా లేకపోవడం మనకు అతిపెద్ద మైనస్ అయినా.. జట్టులో షమీ.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల.. ప్రారంభ, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగల సామర్థ్యమున్న అర్షదీప్ సింగ్ ఉండడంతో మనకు అంతగా సమస్యలు రాకపోవచ్చు. అంతేకాదు మూడో సీమర్ గా హార్దిక్ పాండ్యా ఉండడం జట్టుకు అతిపెద్ద అసెట్.. 6 గురు పూర్తిస్థాయి బౌలర్లు మనకు అందుబాటులో ఉన్నారు. పేస్ బౌలింగ్ లో ముగ్గురు.. స్పిన్ విభాగంలో జడేజా, అక్షర్, కుల్దీప్ ఉన్నారు. ఇప్పుడు మిగిలిన ఏ జట్లకూ ఇలా పూర్తి 10 ఓవర్ల కోటా పూర్తి చేయగల బౌలర్లు ఫైనల్ ఎలెవన్ లో లేరు. అంతేకాదు మనకు హార్దిక్, అక్షర్, జడేజా రూపంలో ముగ్గురు జెన్యూన్ ఆల్ రౌండర్లు ఉన్నారు. వీళ్లంతా పది ఓవర్లతో పాటు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సమర్థులు.. అందుకే టీమిండియా హాట్ ఫేవరెట్ అని అంటున్నారు.

టీమిండియాకు మిగిలిన జట్లకు అదే తేడా

ఐసీసీ టోర్నీలంటేనే పూనకం వచ్చినట్లుగా చెలరేగి ట్రోఫీలు ఎగరేసుకుపోయే ఆస్ట్రేలియా జట్టుది ప్రస్తుతం గడ్డు పరిస్థితి. కెప్టెన్ కమిన్స్.. హేజిల్ వుడ్ గాయాలతో ..ఇక స్టార్క్ వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరం కావడం వారికి పెద్ద దెబ్బగా మారింది. వీరు ముగ్గురు లేని ఆసీస్ పేస్ విభాగానికి టోర్నీలో అతిపెద్ద పరీక్ష ఎదురు కానుంది. ఇక ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా తప్పుకోగా.. మార్కస్ స్టోయినిస్ వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడం.. అదీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు కావడం కంగారూలకు షాక్ .. ఇక స్మిత్ సారథ్యంలోని ఆసీస్ జట్టు లీగ్ దశ దాటితే గొప్పనే.. ఒకవేళ వాళ్లు మళ్లీ నాకౌట్ కు చేరితే టైటిల్ కు పోటీదారు అవుతారు. కానీ అందరూ కొత్త వాళ్లతో ..ఇంత పెద్ద మేజర్ టోర్నీలో ముందంజ వేయడం కష్టమే. ఇక ఇంగ్లండ్ ..బజ్ బాల్ గేమ్ అనుకుంటూ ఉన్న గేమ్ నూ ఊడగొట్టుకున్నరనేలా ఆడుతున్నారు. అంతేకాదు పేస్ బౌలింగ్ బాగానే ఆడుతున్నా..స్పిన్నర్ల బౌలింగ్ లో ఎలా ఆడాలో తెలియడం లేదు. పాకిస్థాన్, దుబాయ్ వేదికలు స్వతాహాగా స్పిన్ కు అనుకూలిస్తాయి. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు రాణించడం కష్టమే. భారత్ క్లీన్ స్వీప్ చేయడమే వీరి స్పిన్ బలహీనతను బట్టబయలు చేసింది. ఇక చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇంగ్లండ్ కు కష్టమే. మరోవైపు సౌతాఫ్రికా కూడా కీలక ప్లేయర్లు గాయాలతో తప్పుకోవడంతో బలహీన పడింది. పాకిస్థాన్ లో ముక్కోణపు సిరీస్ లోనూ పేలవంగా ఆడింది. ఇక ముక్కోణపు సిరీస్ విజేతగా ..అదీ పాకిస్థాన్ గడ్డపై ఆడి గెలిచిన న్యూజిలాండ్ టీమ్ బాగానే ఉన్నా.. వారు ఎక్కువగా ఐసీసీ టోర్నీలు గెలిచిన చరిత్ర లేదు. కీలకమైన సెమీస్ లేదా.. నాకౌట్ రౌండ్లలోనే వెనుదిరగడం బ్లాక్ క్యాప్స్ కు అలవాటుగా మారింది.  ఇక పపాకిస్థాన్ అన్ ప్రెడిక్టబుల్..ఎప్పుడు ఎలా ఆడుతుందో వారికే తెలియదు. బాగా ఆడొచ్చు.. లేదంటే పరమచెత్తగా ఓడిపోవచ్చు. ఇక ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లకు ఐసీసీ టోర్నీలు గెలిచిన పాపాన పోలేదు. ఇలాంటి మేజర్ టోర్నీల్లో ఒకటిరెండు సంచలనాలు తప్ప వారి నుంచి ఆశించేదేమీ లేదు. బంగ్లాతో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్థాన్ కు మాత్రం ముందంజ వేసే చాన్స్ ఉంది.

ఐసీసీ టోర్నీల్లో మన రికార్డు సూపర్..

ఐసీసీ వన్డే టోర్నీలో మనకు ఘనమైన రికార్డు ఉంది. రెండుసార్లు ట్రోఫీ గెలుచుకున్నాం. రెండుసార్లు పైనల్ చేరుకున్నాం. అంతేకాదు దాదాపు 14 ఏండ్లుగా మనం ఐసీసీ టోర్నీల్లో కనీసం సెమీస్ చేరకుండా వెనుదిరిగన చరిత్ర లేదు. 2000 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్. 2002లో శ్రీలంకతో సంయుక్తంగా విజేతలుగా.. 2013లో ధోనీ కెప్టెన్సీలో చాంపియన్స్ ట్రోఫీ విక్టరీ..2017 లోనూ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రన్నరప్..ఇదీ చాంపియన్స్ ట్రోఫీలో మన రికార్డు. ఇక 2011 ప్రపంచకప్ విజేత. 2015 సెమీస్,2019 సెమీస్, 2023 ఫైనల్. ఇలా ఐసీసీ టోర్నీల్లో మనం దుమ్మురేపడం కొత్త కాదు.. హాట్ ఫేవరెట్ హోదాతో బరిలోకి దిగడం కొత్తకాదు. 2011 ప్రపంచకప్ విజేత దగ్గర నుంచి 14 ఏండ్ల మన గ్రాఫ్ అదుర్స్..టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో గెలవదు అనేందుకు ఆస్కారం లేదు.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?