కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీపై ఎటువంటి ట్రోలింగ్ నడుస్తుందో తెలియని విషయం కాదు. ఇటీవల శ్రీకాకుళంలో అరసవల్లి రథసప్తమి వేడుకల్లో పాల్గొన్న ఆమెపై టీడీపీ అభిమానులు, సానుభూతి పరులు ఫైర్ అవుతూ, ఏపీ సీఎం చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ.. షాకింగ్ పోస్ట్‌లు చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోసం ఆమె పాట పాడటం, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్వీబిసి ఛానల్ సలహాదారునిగా నియమించబడటం వంటి వాటిని బయటపెడుతూ.. ఆమెను ఎలా అరవవల్లి రథసప్తమి వేడుకలకు ఆహ్వానిస్తారు అంటూ పెద్ద కాంట్రవర్సీకి తెరలేపారు. ఈ కాంట్రవర్సీతో పాటు.. గతంలో ఆమె టీడీపీ కోసం పాట పాడమని అడిగితే.. రిజిక్ట్ చేసిందనేలా సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న పోస్ట్‌లు వైరల్ అవుతూ మంగ్లీపై, అరసవల్లి ఘటనకు కారణమైన టీడీపీ నాయకులపై టీడీపీ అభిమానులు ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక తనపై వస్తున్న ట్రోలింగ్, పోస్ట్‌లపై మంగ్లీ సోషల్ మీడియా వేదికగా ఓ ఓపెన్ లెటర్‌ను విడుదల చేసి, వివరణ ఇచ్చారు.
ఇందులో.. అరసవల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ కన్సర్ట్‌కు తనని ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన మంగ్లీ, మరో జన్మంటూ ఉంటే సిక్కోలు గడ్డపై పుడతానని వేదికపైనే కృతజ్ఞత ప్రకటించుకున్నట్లుగా తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తన కన్సర్ట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారని, ఒక కళాకారునిగా గుర్తించి, వారితో పాటు సూర్యభగవానుని ఆలయానికి తీసుకెళ్లారని, కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా మంత్రి కుటుంబం ఒక ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించారని, గొప్ప మనసుతో ఒక కళాకారిణిని గౌరవించడం తప్పు ఎలా అవుతుంది? అంటూ మంగ్లీ ప్రశ్నించింది. ఇంకా ఆమె ఈ లేఖలో..
Also Read- Vishwambhara: మెగాస్టార్‌తో మేనల్లుడు.. ‘విశ్వంభర’ తాజా అప్డేట్ ఇదే!
అన్నీ పార్టీలకు పాటలు పాడాను
2019 ఎన్నికలకు ముందు వైసీపీ లీడర్లు కొందరు సంప్రదిస్తే పాట పాడాను, ఆ తర్వాత రెండు నియోజక వర్గాల్లో క్యాంపెయిన్ చేశాను. అక్కడి స్థానిక నేతలు నాకు తెలిసిన కారణంగా వారికి సపోర్ట్ చేశాను. అయినా ఎవరినీ నేను దూషించలేదు. పార్టీ జెండా కూడా పట్టుకోలేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. ఒక కళాకారిణిగా వైసీపీ, బిజెపి, టీఆర్ఎస్‌లతో పాటు దాదాపు అన్ని పార్టీలకు పాటలు పాడాను. ఆ పాటలు పాడటం కారణంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. అందుకే 2024లో నేను ఏ పార్టీకి పాటలు పాడలేదు. వైసీపీ అడిగినా కూడా తిరస్కరించాను. దయచేసి రాజకీయాలకు అతీతంగా నన్ను ఆదరించాలని, అభిమానించాలని కోరుకుంటున్నాను.
పదవులను నమ్ముకుని రాలేదు
బంజారా జాతి నుండి వచ్చి కల్చరల్ పాటలను పాడుతున్న సందర్భంగానూ, రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలో చదువుకున్నాననే నేపథ్యంలో ఒక కళాకారిణిగా గుర్తించి ఎస్వీబిసి ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు అధికారులు సంప్రదించారు. అయినా కూడా ఆ పదవిని స్వీకరించాలా? వద్దా అని తర్జన భర్జన పడ్డాను. ఇది రాజకీయ పదవి కాదని నా శ్రేయోభిలాషులు సూచించిన మేరకే నేను ఆ పదవిని కొనసాగించానే తప్ప.. ఎక్కడా ఆ పదవి గురించి బహిరంగ ప్రకటన చేయలేదు. నేను పాటను నమ్ముకుని వచ్చాను తప్పితే.. పార్టీలను, పదవులను నమ్ముకుని రాలేదని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను.
Also Read- Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్ రివీలైంది.. ఎంత క్యూట్‌గా ఉందో!

అదంతా ఫేక్ ప్రచారం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును నేను ఎక్కడా అనని మాటలను, ఆధారాలు లేకుండా, వాస్తవాలు తెలియకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ‘చంద్రబాబుగారికి నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను’. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరం. దయచేసి నా పాటకు రాజకీయ రంగు పులమొద్దని, ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదని మరోసారి విన్నవించుకుంటున్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను, నా పాటను ఇలాగే ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.