Jaya Lalitha Assets: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ప్రస్తుతం వాటి విలువ రూ. 4 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇప్పటివరకు బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో భద్రపరిచిన వాటిని అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి శుక్రవారం అందజేశారు.
అందులో 10 వేల చీరలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 600 కిలోల వెండి వస్తువులు, 750 చెప్పుల జతలు, 1,672 ఏకరాల వ్యవసాయ భూముల దస్తావేజులు అలాగే నివాసాలకు సంబంధించిన పత్రాలు ఉన్నట్లు సమాచారం. వీటిని భారీ భద్రత నడుమ బెంగళూరు నుంచి ఆరు ట్రంకు పెట్టెల్లో తరలించినట్లు తెలుస్తోంది. జయలలితకు వారసులు ఎవరు లేకపోవడంతో ఖజానాను అక్కడి ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు కర్ణాటక కోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. తాజాగా తరలింపు ప్రక్రియ పూర్తయింది.
అక్రమార్జనకు సంబంధించిన కేసులో సీఎంగా ఉండగానే జయలలితకు శిక్ష పడింది. అనంతరం 2014లో ఆ కేసు తమిళనాడు నుంచి కర్ణాటకు బదిలీ అయింది. ఆ సమయంలో జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను అప్పటి నుంచి పరప్పన అగ్రహారానికి చెందిన కారాగారంలో భద్రపరిచారు. తాజాగా న్యాయమూర్తి హెచ్ ఎన్ మూర్తి సమక్షంలో తరలింపు ప్రక్రియను చేపట్టారు.
కాగా, దాదాపు రెండు దశాబ్దాల పాటు నటిగా వెలుగు వెలిగిన జయలలిత 1984లో తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ ప్రోద్భలంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన మరణానంతరం తన వారసురాలిగా ప్రకటించుకొని ముఖ్యమంత్రి కాగలిగారు. కరుణానిధి లాంటి నేతలను ఎదుర్కొంటూ రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె 2016లో మరణించారు.