Municipal Elections: స్థానిక పురపోరులో ప్రచారాల్ని అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన మున్సిపల్ నోటిఫికేషన్ తో ఒక్కసారిగా పార్టీలు అన్ని అలర్ట్ అయ్యాయి. అనుకున్నంత సమయం లేకపోవడంతో తేరుకున్న పార్టీలు వార్డు కౌన్సిలర్ గా, కార్పోరేటర్ గా విజయం సాధించేందుకు అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగారు. గెలుపే ధ్యేయంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.
మొత్తం 98 వార్డులు
మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు, డోర్నకల్ లో 15 వార్డులు, మరిపెడ లో 16 వార్డులు, కేసముద్రం లో 16 వార్డులు, తొర్రూరులో 16 వార్డులు, డోర్నకల్ లో 15 సహా మొత్తం 98 వార్డులు, ఖమ్మం జిల్లాలో ఏదులాపురం 32, వైరా20, సత్తుపల్లి23, కల్లూరు20, మధిర22 సహా 117, కొత్తగూడెం నగరపాలక సంస్థకు సంబంధించి కొత్తగూడెంలో 29 డివిజన్లు, పాల్వంచలో 27 డివిజన్లు, సుజాతనగర్ లో 4 డివిజన్లో సహా మొత్తం 60 డివిజన్లకు అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్, స్థానిక ఎమ్మెల్యే పార్టీ సిపిఐ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది.
తమ వార్డుల్లో ప్రచారాన్ని జోరు
నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలో 20 వార్డులు, సూర్యాపేటలో 48 వార్డులు, కోదాడలో 35 వార్డులు, హుజూర్ నగర్ లో 28, నేరేడు చెర్ల 15, తిరుమలగిరి 15 సహా మొత్తం 141 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులచే నామినేషన్లు దాఖలు చేయించారు. అధికార, ప్రతిపక్ష, బీజెపి పార్టీల అభ్యర్థులను నిలబెట్టి నామినేషన్లు దాఖలు చేయించడంలోనూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు.
ప్రత్యేక వాహనాలను సిద్ధం
కొత్తగా మునిసిపల్ వార్డులకు ప్రచారం చేయడానికి ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసుకుని, అభ్యర్థుల పేరుతో మైకుల ద్వారా ప్రచారం సాగించడం నూతన సంస్కృతికి దారితీస్తోంది. ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే పరిమితమైన వాహన ప్రచారాలు నేడు వార్డు కౌన్సిలర్లకు సైతం ఆ సంస్కృతి వచ్చింది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమకు చేతనైన హామీలను ఇవ్వడంతో పాటు ఈ సారికి తమకు అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరి కొంతమంది ఇప్పటినుంచే వార్డుల్లో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని ప్రచారం నిర్వహించే వారికి భోజనాలతో పాటు మద్యం కూడా అందిస్తున్నారు. ప్రచారంలో కొత్త ఒరవడి తీసుకొస్తూ వార్డు కౌన్సిలర్లు ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇప్పటినుంచి ప్రలోభాలకు గురి చేస్తూ ఓటర్లను తమ వైపు మళ్ళించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

