Municipal Elections: రాష్ట్ర పురపాలిక పోరులో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకల్లా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఆవరణలోకి వచ్చిన అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లను రాత్రి వరకు స్వీకరించారు. రాష్ట్రంలోని ఒక వంద పదహారు మున్సిపాలిటీలు ఏడు మునిసిపల్ కార్పొరేషన్ లకు ఈ నెల 27వ తేదీన స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ జారీ చేసిన సంఘటన తెలిసిందే.
మొత్తం 28456 నామినేషన్లను
ఆ మరుసటి రోజు అయినా 28వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా 28వ తేదీ తొలి రోజున 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లు సమర్పించగా, రెండో రోజైన గురువారం 7080 మంది అభ్యర్థులు 7403 నామినేషన్లను సమర్పించినట్టు స్టేట్ ఈసీ తెలిపింది. నామినేషన్లు ఎక్కువగా సంగారెడ్డి జిల్లాలో 2268, కరీంనగర్ జిల్లాలో 1947, నల్లగొండ లో1795, సూర్యాపేటలో 1617, మంచిర్యాల జిల్లాలో 1575 నామినేషన్ స్వీకరించినట్లు స్టేట్ ఈసీ తెలిపింది. మూడు రోజుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా మొత్తం 28456 నామినేషన్లను స్వీకరించినట్లు సమాచారం.
నెల 11వ తేదీన పోలింగ్
నామినేషన్ల పరిశీలన, విత్ డ్రా వంటి కీలక ప్రక్రియలు ముగిసిన తర్వాత వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ నిర్వహించి, 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించి ఫలితాలు ప్రకటించేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. నామినేషన్ల సమర్పణ ప్రక్రియ శుక్రవారం ముగిసిన సందర్భంగా అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రచారానికి వెళ్లే అవకాశమున్నందున ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలయ్యేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ 742 మంది జోనల్ ఆఫీసర్లను నియమించింది. అందులో 279 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లను, మరో 381 మందితో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ ల తో తనిఖీలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేసింది.

