CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక ‘లీడర్‌షిప్’ కోర్సులో పాల్గొని తన పర్యటనను ముగించారు. ఇక ముఖ్యమంత్రి రాకతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం ఆయన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన నిర్ణయాలపై కీలక చర్చ జరగనుంది.దీనితో పాటు రాష్ట్ర కేబినెట్ విస్తరణ , నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సమావేశంలో చర్చకు రానున్న ప్రధాన అంశాలు ఇవే
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలు నిర్ణయాలను సీఎం వివరించనున్నారు. ఇక గత కొద్ది రోజులుగా బీఆర్‌ఎస్ పార్టీ సింగరేణిలో బొగ్గు టెండర్ల విషయంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి బంధువులకు టెండర్లు కట్టబెట్టారని కేటిఆర్ చేస్తున్న విమర్శలను ప్రభుత్వం ఏ విధంగా తిప్పికొట్టాలి? దీనిపై అంతర్గత విచారణ అవసరమా? అనే అంశాలపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు.
రూ. 5.75 లక్షల కోట్ల మేర ఒప్పందాలు
అంతే కాకుండా ఇటీవల కాలంలో కొందరు మంత్రుల తీరుపై, వారి శాఖల్లో జరుగుతున్న పరిణామాలపై కొన్ని దినపత్రికల్లో వెలువడిన వ్యతిరేక వార్తా కథనాలను సీఎం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి పెరుగుతున్న తరుణంలో, మంత్రులు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. మరో వైపు దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న రూ. 5.75 లక్షల కోట్ల మేర ఒప్పందాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

