MLA Kaushik Reddy: కరీంనగర్ సీపీని మతం పేరుతో దూషించిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) తప్పు ఒప్పుకున్నారు. క్షమాపణ చెప్పాలంటూ ఐపీఎస్‌ల సంఘం హెచ్చరించడంతో ఆయన దిగివచ్చారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదని, మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారని ఆరోపించారు. పోలీసులు, అధికారులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. కానీ తాము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో కొందరు అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారని, ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారానని కౌశిక్ రెడ్డి అంగీకరించారు. అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావని క్లారిటీ ఇచ్చారు.
మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు
తన మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి తాను క్షమాపణలు తెలియజేస్తున్నానని వీడియోలో కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నానని అన్నారు. తన సొంత గ్రామం వీణవంకలో సమ్మక్క అనే జాతర జరుగుతుందని, ఆ జాతరలో ముక్కులు చెల్లించడానికి తాను, సతీమణి కలిసి వెళ్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో ఉన్న సీపీ, ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐ ఏవిధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకెళ్లారో అందరూ చూశారని చెప్పారు. ఆ ఫ్రస్టేషన్లో నోరు జారానని అన్నారు. ఆ క్రమంలో సీపీని ఒక మాట అన్నానని, కానీ, ఏ కులాన్నో, మతాన్ని అవమానించడానికి ఆ మాట అనలేదని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also- Revanth Reddy: హార్వర్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తిచేసుకున్న సీఎం రేవంత్.. ఆసక్తికరమైన ట్వీట్
ఏంటీ వివాదం?
కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంపై హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి దుర్భాషలాడారు. కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామంలో సమ్మక్క జాతరకు కౌశిక్ రెడ్డి కుటుంబసమేతంగా భారీ కాన్వాయ్‌తో గురువారం వెళ్లారు. అయితే హైకోర్టు ఆదేశాల దృష్ట్యా పరిమిత వాహనాలనే అనుమతి ఇస్తామని పోలీసులు సూచించడాన్ని కౌశిక్ రెడ్డి తప్పుబట్టారు. కారు దిగి, కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలంపై ఆయన మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది.
నోరుజారిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశిక్ రెడ్డి దుర్మార్గపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిపై వ్యక్తిగత దాడి చేయడం చట్ట రిత్యా నేరమని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి చేసిన మత మార్పిడుల ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఐపీఎస్ సంఘం పేర్కొంది. ఈ ఘటన సివిల్ సర్వెంట్ల మనోబలాన్ని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొంది.
Read Also- Varanasi: అఫీషియల్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ చెప్పేసిన సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

