Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (Harvard Kennedy School Programme) విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో ‘21వ శతాబ్దంలో నాయకత్వం’ అనే అంశంపై ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ఇవాళ పూర్తి చేశానని, ఈ విషయాన్ని వెల్లడించడానికి తాను చాలా సంతోషిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు.
20 దేశాలు.. 60 మంది ప్రతినిధులు
హార్వర్డ్ ప్రోగ్రామ్‌లో 20 దేశాలకు చెందిన 60 మందికి పైగా స్టూడెంట్స్ పాల్గొన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అద్భుతమైన టీచర్లు, ఫ్యాకల్టీ నుంచి మాత్రమే కాకుండా, తోటి విద్యార్థుల నుంచి కూడా తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రోగ్రామ్ జరుగుతున్న సమయంలో వివిధ విభాగాలలో చదువుకుంటున్న ఎంతో మంది అత్యున్నత స్థాయిలో ఉన్న సక్సెస్ఫుల్ వ్యక్తులను కలిసే అవకాశం కూడా తనకు దక్కిందని ఆయన గుర్తుచేశారు.
కఠిన వాతావరణాన్ని అధిగమించి
ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కొనసాగిన వారం రోజులపాటు అమెరికాలో బయట వాతావరణం చాలా కఠినంగా ఉందనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. విపరీతమైన మంచు తుపాను, గడ్డకట్టే చలి వాతావరణం, 3 అడుగుల కంటే ఎక్కువగా పేరుకుపోయిన మంచు, శీతల గాలుల మధ్య ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రయాణం కొనసాగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ అందుకుంటున్న ఫొటోలను ఈ సందర్భంగా ఆయన షేర్ చేశారు.
కోర్స్ ఎలా ఉపయోగపడుతుంది?
సాధారణంగా రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, కార్పొరేట్ దిగ్గజాలు ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్‌కు హాజరవుతుంటారు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఈ కోర్సు చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. సంక్లిష్ట సమస్యల పరిష్కారం, రాజకీయాల్లో లేదా ప్రభుత్వ పాలనలో ఎదురయ్యే కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో దోహదపడుతుంది. వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సవాళ్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై స్పష్టత వచ్చింది.
Read Also- MLA Kaushik Reddy: సమ్మక్క జాతరలో ఓవరాక్షన్.. పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ సంఘం సీరియస్
ఈ తరహా ప్రోగ్రామ్స్‌లో వేర్వేరు దేశాలకు చెందిన విజయవంతమైన ప్రతినిధులు ఉంటారు. వీరంతా దాదాపుగా వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నవారే అవుతారు. ఇలాంటి వ్యక్తులతో చర్చలు జరపడంతో ఇతర దేశాల్లో, లేదా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మంచి పద్ధతులు తెలుస్తాయి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అవసరమైన పరిచయాలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది.
ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడంతో పాలనపై కొత్త ఆలోచనలు కలుగుతాయి. ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో అత్యాధునిక టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో ఈ కోర్సుల్లో నేర్పిస్తారు. అలాగే, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక మాంద్యం వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు నాయకులు ఎలా వ్యవహరించాలి, ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి? అనే దానిపై కేస్ స్టడీస్ ద్వారా వివరిస్తారు. ఇవన్నీ నాయకుల్లో కొత్త విజన్‌కు బాటలు వేస్తాయనడంలో సందేహం లేదని నిపుణులు చేస్తున్నారు.

