Medaram Jatara 2026: సమ్మక్క – సారలమ్మ మహా జాతర సందర్భంగా మేడారంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడం.. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గద్దెలపై ఉన్న సమ్మక్కతో పాటు సారలమ్మ, పడిగిద్దరాజు, జంపన్నలను దర్శించుకొని మెుక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సాధారణ దర్శనానికి 3-4 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే భక్తుల అవసరాన్ని అసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు.. మేడారంలో దోపిడికి తెరలేపినట్లు తెలుస్తోంది.
మాంసం ధరలు రెట్టింపు!
మేడారంలో వనదేవతలను దర్శించుకున్న అనంతరం.. చాలా మంది భక్తులు అక్కడే మాంసాహారాన్ని వండుకొని కుటుంబ సమేతంగా భుజిస్తుంటారు. దీనిని అవకాశంగా మార్చుకున్న కొందరు వ్యాపారులు.. చికెన్, మటన్ కు ఎక్కువ మెుత్తం వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. సాధారణ మార్కెట్ లో కేజీ చికెన్ రూ.280-320 మధ్య ఉండగా.. మేడారంలో మాత్రం రూ.400-450 వసూలు చేస్తున్నట్లు మండిపడుతున్నారు. అటు రూ.950-1000 మధ్య ఉండే మటన్ ను ఏకంగా రూ.1500లకు విక్రయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. రవాణా ఖర్చులు ఉంటాయి కదా అని సమాధానం ఇస్తున్నట్లు తెలియజేస్తున్నారు.
మేడారంలో భక్తుల సందడి
భారీ ఎత్తున తరలివచ్చి వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
నిన్న రాత్రి గద్దెపైకి చేరుకున్న సమ్మక్క తల్లి
Latest Visuals of Devotees from Medaram Maha Jatara pic.twitter.com/r5ulArkXjK
— BIG TV Breaking News (@bigtvtelugu) January 30, 2026
మాంసం బాటలోనే మద్యం..
వన దేవతల జాతర అంటే మందుబాబులకు పండగే అని చెబుతారు. బంధుమిత్రులతో సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని.. మాంసాహారంతో పాటు కొందరు భక్తులు తప్పనిసరిగా మద్యాన్ని సేవిస్తుంటారు. ఈ నేపథ్యంలో మేడారంలో మద్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బయట రూ.180కి దొరికే బీర్ ను రూ.300 వరకూ విక్రయిస్తున్నట్లు మందుబాబులు ఆరోపిస్తున్నారు. మద్యం బాటిళ్లపై ఉన్న ఎంఆర్పీకి అదనంగా రూ.150-200 వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: School Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. స్పాట్లో ఏడుగురు విద్యార్థులు..!
చెట్టు కింద ఉంటే రూ.1000 వసూల్!
మేడారం జాతర అనగానే భక్తులను వెంటాడే ప్రధాన సమస్యల్లో అద్దె గదులు ఒకటి. జాతర జరిగే నాలుగు రోజుల పాటు చాలా మంది భక్తులు కుటుంబ సమేతంగా అక్కడే జీవిస్తుంటారు. ఈ నేపథ్యంలో అద్దె గదులకు భారీ మెుత్తంలో స్థానికులు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేని చిన్నపాటి గదులకు ఏకంగా రూ.5000 వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల అయితే చెట్టు కింద ఉంటున్నందుకు కూడా రూ. 500-1000 డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. వనదేవతల దర్శనానికి వచ్చిన తమను ఇలా స్థానికులు నిలువునా దోచుకుంటుండంపై అధికారులు దృష్టి సారించాలని మేడారం భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

