Delhi Murder: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దిల్లీ పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేసే భార్యను.. ఆమె భర్త అతి దారుణంగా హత్య చేశాడు. 4 నెలల గర్భవతి అని కూడా చూడకుండా డంబెల్ తో తలపై పలుమార్లు మోదాడు. జనవరి 22న ఈ దాడి జరగ్గా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్తను అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే?
27 ఏళ్ల స్వాట్ కమాండో కాజల్ చౌదరిపై ఆమె భర్త అంకూర్ డంబెల్ తో దాడి చేసినట్లు దిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఆమె సోదరుడు నిఖిల్ తెలిపాడు. సోదరితో తాను ఫోన్ లో మాట్లాడుతున్న క్రమంలోనే అంకూర్ డంబెల్ తో కొట్టడం ప్రారంభించాడని పేర్కొన్నారు. కాజల్ చౌదరికి బంధువైన సాహిల్ మాట్లాడుతూ ఆమెను నిత్యం వరకట్నం కోసం వేధించినట్లు ఆరోపించారు. భర్తతో పాటు, అత్తా, మరిది కూడా డబ్బు కోసం వేధించారని పేర్కొన్నాడు.
భర్త అరెస్టు..
కాజల్ భర్త అంకూర్ రక్షణ మంత్రిత్వశాఖలో క్లర్క్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బు విషయంలో భార్య, భర్తల మధ్య నిత్యం సమస్యలు వస్తుండటంతో కాజల్ తల్లిదండ్రులు.. అంకూర్ కు కొద్ది మెుత్తంలో డబ్బు కూడా ఇచ్చారని సాహిల్ తెలిపాడు. మరోవైపు స్వాట్ మహిళా కమాండో మృతి నేపథ్యంలో దిల్లీ పోలీసులు.. అంకూర్ పై హత్య కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపారు.
Also Read: Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు
2023లో వివాహం..
కాగా, కాజల్ చౌదరి 2022లో దిల్లీ పోలీసు డిపార్ట్ మెంట్ లో చేరారు. ప్రస్తుతం ఆమె స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (SWAT) బృందంలో పనిచేస్తున్నారు. ఆమె 2023లో దిల్లీ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన అంకూర్ ను వివాదం చేసుకున్నారు. ఓ నివేదిక ప్రకారం.. వీరిద్దరికి ఏడాదిన్నర వయసున్న ఓ కుమారుడు సైతం ఉన్నాడు. అయితే పోలీసు శాఖలో ఉన్నత స్థానంలో పనిచేస్తున్న మహిళ సైతం భర్త వేధింపులకు గురై చివరకి ప్రాణాలు కోల్పోవడం ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేస్తోంది.

