CM Revanth Reddy: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పాలకపక్షం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తుండగా, ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (CM Revanth Reddy) అక్కడి నుంచే పార్టీ నేతలతో నిరంతరం టచ్లో ఉంటూ ఎన్నికల వ్యూహాలను రచించడం గమనార్హం.హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్లిన సీఎం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రతిరోజూ ఇన్చార్జ్ మంత్రులు, పీసీసీ ముఖ్య నేతల నుంచి క్షేత్రస్థాయి నివేదికలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రొఫెషనల్ ఏజెన్సీలు ఇచ్చిన సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, విజయం పై వ్యూహాలను అమలు చేయాలని సూచించారు.
స్థానిక పొత్తులపై సీఎం స్టడీ
ఈ ఎన్నికల్లో కేవలం పార్టీ బలంపైనే కాకుండా, అవసరమైన చోట స్థానిక సమీకరణాల ఆధారంగా పొత్తులు లేదా అవగాహనలపై సీఎం దృష్టి సారించారు.పార్టీ సిద్ధాంతాల కంటే ‘గెలుపు గుర్రాలకే’ ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే స్థానిక బలం ఉన్న చిన్న పార్టీలు , స్వతంత్ర అభ్యర్థులతో లోపాయికారీ ఒప్పందాలపైనా సీఎం అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం, విధేయతతో పాటు గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఏవైనా రెబల్ బెడద ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యతను ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులకే అప్పగించారు.ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ వంటి కీలక ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ఇక్కడ ప్రతిపక్షాలు బలంగా ఉన్న వార్డుల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు స్థానిక సామాజిక వర్గాలతో పొత్తులపై సీఎం కీలక సూచనలు చేశారు.ఇక ఖమ్మంలో పార్టీ నేతల మధ్య సమన్వయం దెబ్బతినకుండా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర కీలక నేతలు కలిసి పని చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతానికి గడువు ఉన్న కార్పొరేషన్లను వదిలి, ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలపై పూర్తి పట్టు సాధించాలని సూచించారు.
అభ్యర్థుల విజయం కోసం స్పెషల్ వ్యూహం
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.తెలంగాణ అభివృద్ధి కోసం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను ఓటర్లకు వివరించాలన్నారు ఫిబ్రవరి 3న సీఎం అమెరికా నుండి తిరిగి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రధాన బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు.మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం, ఈ ఫలితాల ఆధారంగానే తన ప్రభుత్వ పాలనకు ప్రజా ఆమోదం లభిస్తుందని నమ్ముతున్నారు. అందుకే విదేశీ పర్యటనలో ఉన్నా, తన దృష్టినంతా రాష్ట్ర రాజకీయాలపైనే ఉంచినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
Also Read: CM Revanth Reddy: తెలంగాణతో భాగస్వామ్యం కోసం ముందుకొచ్చిన ఎక్స్పర్టైజ్, అలోన్ స్టోపెల్ ప్రతినిధులు

