Anil Ravipudi: టాలీవుడ్లో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా దూసుకెళ్తూ, మరో రాజమౌళి (SS Rajamouli) అనిపించుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). రీసెంట్గా వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasada Garu) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి, ఇంకా ఆ సక్సెస్ జోష్‌లోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా 360 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టిన విషయం తెలిసిందే. ఎలాగైనా 400 కోట్లు గ్రాస్ రాబట్టాలని, చిత్రయూనిట్ ఇంకా ప్రమోషన్స్‌ను నిర్వహిస్తూనే ఉంది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తున్న అంశంపై, అలాగే ఆయన చదువుకున్న కాలేజ్ విషయాలను ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.
జడ్జిలా ఉండటం లేదు..
ముందుగా బుల్లితెర విషయానికి వస్తే.. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా అనిల్ రావిపూడి తనదైన ముద్ర వేస్తున్నారు. సాధారణంగా స్టార్ డైరెక్టర్లు టీవీ షోలకు దూరంగా ఉంటారనే టాక్ ఉంటుంది, కానీ అనిల్ రావిపూడి మాత్రం జడ్జ్ సీటులో కూర్చుని అల్లరి చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. టాప్ డైరెక్టర్‌గా ఉన్న మీరు టీవీ షోలలో ఎందుకు కనిపిస్తున్నారు? అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి చాలా సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా నాలానే ఉండడానికి ఇష్టపడతాను. ఆ షోలో నేను కేవలం జడ్జ్ లాగా సీరియస్‌గా కూర్చోవట్లేదు.. డ్యాన్సులు చేస్తున్నాను, మిమిక్రీ చేస్తున్నాను, గందరగోళం చేస్తున్నాను. ఎక్కడ ఎంటర్టైన్ చేసే అవకాశం ఉన్నా నేను అక్కడికి వెళ్తాను’’ అని స్పష్టం చేశారు. టీవీ ద్వారా సామాన్య ప్రజలకు మరింత దగ్గరవ్వచ్చని, సినిమా టూర్లకి వెళ్ళినప్పుడు ప్రజలు తనను టీవీలో చూసి గుర్తుపడుతుంటే చాలా ఆనందంగా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
Also Read- Shabara Telugu Teaser: రక్తం చూడని యుద్ధముంటుందా?.. ఆసక్తికరంగా ‘శబార’ టీజర్!
ఎన్టీఆర్, కేటీఆర్.. నేను కూడా!
ఇక తను చదువుకున్న విజ్ఞాన్ కాలేజ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. కాలేజ్‌లో కూడా నేనేం టాపర్‌ని కాదని తెలిపారు. ఎప్పుడూ అల్లరి చేస్తూనే ఉండేవాడినని వడ్డమూడి విజ్ఞాన్ కాలేజ్ విషయాలను పంచుకున్నారు. అదే కాలేజీలో చదివిన జూనియర్ ఎన్టీఆర్ ఒక పెద్ద స్టార్ హీరోగా, కేటీఆర్ ఒక పెద్ద పొలిటీషియన్‌గా ఎదగడంపై స్పందిస్తూ, తన కెరీర్ కూడా అక్కడే మొదలైందని గుర్తు చేసుకున్నారు. కాలేజీ చైర్మన్ రత్తయ్య చాలా స్ట్రిక్ట్ అని, కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో తాను చేసిన పెర్ఫార్మెన్స్ వల్ల ఆయన దృష్టిలో పడ్డానని సరదాగా వ్యాఖ్యానించారు. అల్లరి చేసే సమయంలో ఆయన దృష్టిలో పడలేదు కానీ, కల్చరల్ యాక్టివిటీస్ టైమ్‌లో ఒకటి రెండు సార్లు ఆయన నుంచి అవార్డులు తీసుకున్నట్లుగా అనిల్ తెలిపారు. ప్రస్తుతం దర్శకుడైన తర్వాత మాత్రం ఆయనని చాలా సార్లు కలిసినట్లుగా చెప్పారు.
Also Read- Laxmi Raai: సౌత్ నుంచి నార్త్‌కి లక్ష్మీరాయ్ సినిమా.. బ్రేక్ వస్తుందా?
మెగాస్టార్ స్పందన మరువలేను
ఇంకా.. చిన్నారి వరుణవి గురించి చెబుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. టీవీ షో జర్నీలో చిన్నారి వరుణవి తనను బాగా ఎమోషనల్ చేసిందని అనిల్ తెలిపారు. చూపు లేని ఆ చిన్నారిని మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లినప్పుడు, ఆయన స్పందించిన తీరు మరువలేనని చెప్పారు. మెగాస్టార్ ఆ పాపకు రూ. 5 లక్షల చెక్ ఇవ్వడమే కాకుండా, భవిష్యత్తులో ఆమె చదువుకు, సంగీత సాధనకు, కంటి ఆపరేషన్లకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని మాట ఇచ్చారని అనిల్ గుర్తు చేశారు. తాను కూడా ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని, ఆమె టాలెంట్ చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఎమోషనల్ అయ్యారు. మొత్తంగా చూస్తే.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, తనలోని హ్యూమర్‌ను ఎప్పుడూ చంపుకోకుండా ప్రేక్షకులను నవ్వించడమే అనిల్ రావిపూడి సక్సెస్ మంత్రం అని ఈ ఇంటర్వ్యూ ద్వారా మరోసారి అర్థమవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

