Vikarabad Crime: తల్లి దండ్రులను ప్రత్యక్ష దైవాలుగా పెద్దలు చెబుతుంటారు. పిల్లలను నిస్వార్థంగా ప్రేమిస్తూ.. వారి యోగ క్షేమాల కోసం అమ్మ, నాన్నలు నిరంతరం కష్టపడుతుంటారు. బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. అలాంటి తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన ఓ కూతురు.. వారి పాలిట యమపాశంగా మారింది. ప్రేమ పెళ్లికి అడ్డుపతున్నారన్న అక్కసుతో దారుణంగా హత్య చేసింది. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే..
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో ఈ దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులను కూతురు సురేఖ విషమిచ్చి హత్య చేసింది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. అయితే కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి యువతి తల్లి దండ్రులు దశరథ్, లక్ష్మీలు అంగీకరించలేదు. దీంతో ఈ విషయమై పలుమార్లు తల్లిదండ్రులతో సురేఖకు గొడవ సైతం జరిగింది.
పేరెంట్స్ అడ్డు తప్పించాలని..
ప్రేమ వ్యవహారం బయటపడటంతో తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. దీంతో సురేఖ కోపం కట్టుతెంచుకుంది. తల్లిదండ్రులు ఉన్నంతవరకూ తన ప్రేమ గెలవదని భావించి.. వారిని హత్య చేయాలని కుట్ర పన్నింది. తన వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని కిరాతకానికి వాడుకుంది. మనిషి ప్రాణాలను తీయగల ‘Ketamine’ ఇంజక్షన్ ను తల్లిదండ్రుల హత్యకు ఆయుధంగా వాడుకోవాలని ప్లాన్ చేసింది.
రోగాన్ని నయం చేస్తానని చెప్పి..
పథకంలో భాగంగా జనవరి 24వ తేదీన సంగారెడ్డి నుంచి యాచారంలోని ఇంటికి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సురేఖ వచ్చింది. అప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరు పొలం పనులకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత దశరథ్, లక్ష్మీలతో సురేఖ ఎంతో ప్రేమగా మాట్లాడింది. వారి అనారోగ్య సమస్యల గురించి డాక్టర్ తో మాట్లాడానని ఈ మందు వేస్తే తగ్గిపోతుందంటూ వెంట తెచ్చుకున్న ‘Ketamine’ ఇంజక్షన్ ను తల్లిదండ్రులకు చేసింది. దీంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే వారు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: IND vs NZ 4th t20I: విశాఖలో నాల్గో టీ-20.. భారత జట్టులో భారీ మార్పులు.. సంజూకి చావో రేవో!
కేసును ఎలా ఛేదించారంటే?
తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో సురేఖ ఒక్కసారిగా కంగారు పడింది. వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి.. గుండెపోటుతో పేరెంట్స్ మరణించారని చెప్పింది. అయితే ఒకేసారి ఇద్దరికి గుండెపోటు రావడమేంటన్న అనుమానంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటిని పరిశీలించగా.. వారికి ఇంజెక్షన్ కు సంబంధించి ఆధారాలు లభించాయి. దీంతో తమదైన శైలిలో కూతుర్ని ప్రశ్నించగా.. సురేఖ తానే తల్లిదండ్రులను చంపినట్లు అంగీకరించింది. అయితే మూడు రోజుల వ్యవధిలోనే పోలీసులు.. ఈ కేసును ఛేదించడం గమనార్హం.
TG: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులను కూతురు సురేఖ విషమిచ్చి హత్య చేసింది. https://t.co/ufJ6pqymI0 pic.twitter.com/E4510EwCbg
— ChotaNews App (@ChotaNewsApp) January 28, 2026

