AICC: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నడుం బిగించారు. ఇందులో భాగంగా ఆయన సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహించారు. రాబోయే రాజకీయ సవాళ్లు, సంస్థాగత మార్పులు, ఏఐసీసీ ప్రకటించిన నూతన ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశాల్లో కీలక చర్చలు జరిగాయి.
అగ్రనేతలతో కీలక మంతనాలు
మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ పాత్రపై నివేదిక అందజేశారు. ముఖ్యంగా పార్టీ అంతర్గత బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జిల్లా, మండల స్థాయి కమిటీల భర్తీపై ఈ పర్యటనలో స్పష్టత వచ్చినట్లు తెలుస్తున్నది.
Also Read: AICC: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఏఐసీసీ ఆరా? ఇన్‌ఛార్జ్ మంత్రుల నుంచి రిపోర్ట్ సేకరణ!
పూర్తి స్థాయి కమిటీలు
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఖాళీగా ఉన్న పదవులను వెంటనే భర్తీ చేయాలని హైకమాండ్ సూచించింది. ఇక పదవుల పంపిణీలో సామాజిక సమీకరణలతో పాటు, పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.
ఏఐసీసీ ‘ఉద్యమ కార్యాచరణ’పై చర్చ
ఇటీవల ఏఐసీసీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త ఉద్యమ కార్యాచరణను తెలంగాణలో ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ కాంగ్రెస్ గళం విప్పనున్నది. ప్రతి నియోజకవర్గంలో ఏఐసీసీ సూచించిన షెడ్యూల్ ప్రకారం నిరసన కార్యక్రమాలు, పాదయాత్రలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేగాక సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇక ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూడాలని, మంత్రులు, పార్టీ నేతలు కలిసి కట్టుగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని అధిష్టానం స్పష్టం చేసింది. ఈ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ నెలకొన్నది. త్వరలోనే పీసీసీ కార్యవర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

