– పేరు మార్పే ఓటమికి కారణమనే భావనలో కేడర్
– ఎంపీ ఎన్నికల తర్వాత నిర్ణయం
– గులాబీ బాస్ ఆమోదం ఉందనే ప్రచారం
Will BRS Become TRS Again? : భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) త్వరలో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి కాబోతోందా? గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి పేరు మార్పే ప్రధాన కారణమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి గా ఉన్న వినోద్ కుమార్ ఆదివారం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ పేరు మార్పు అంశంపై స్పందించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడం తమ పార్టీలో నూటికి 80 శాతం మందికి ఇష్టం లేదని, ఇటీవల పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా జరుపుతున్న సన్నాహక భేటీల్లో కార్యకర్తలంతా ముక్తకంఠంతో ఇదే మాట చెబుతున్నారని వెల్లడించారు.
అయితే.. పార్టీ పేరును టీఆర్ఎస్‌గా మార్చాలంటే దానిపై న్యాయ సలహా తీసుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం ఖచ్చితంగా ఉండి తీరాలని కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చి దేశ వ్యాప్తంగా పోటీకి దిగుతామని గతంలో కేసీఆర్ ప్రకటించారు.
Read Also : కబ్జా కేసులో ఎంపీ సంతోష్
ఈ క్రమంలో ఆయన మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి సమస్యల మీద గళమెత్తారు. కొన్ని చోట్ల భారీ సభలు నిర్వహించి, జనసమీకరణ చేశారు. ఢిల్లీలో రైతుల పోరులో మరణించిన అనేక రైతు కుటుంబాలకు భారీ మొత్తంలో చెక్కులూ ఇచ్చారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవటం, ఆ వెంటనే జరగుతున్న ఊహించని పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కార్యకర్తలంతా మళ్లీ తెలంగాణ వాదాన్ని భుజాన్ని వేసుకోకపోతే.. పార్టీకి మనుగడ ఉండదనే అభిప్రాయానికి వచ్చి, దీనిని పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకుపోగా, ఎంపీ ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయిద్దామని ఆయన వారికి చెప్పినట్లు తెలుస్తోంది.