– కబ్జా చేసి రూమ్‌లు నిర్మించిన ఎంపీ అనుచరులు
– ఫోర్జరీలతో నకిలీ పత్రాలు సృష్టి
– సంబంధం లేదంటూ ఎంపీ వివరణ
MP Santosh In Possession Case : మరోవైపు భూకబ్జా కేసులో బీఆర్ఎస్ ఎంపీ జోగునపల్లి సంతోష్ రావుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నంబరు 14లోని సర్వే నంబరు 129/54లోని 1350 చదరపు గజాల స్థలాన్ని తమ కంపెనీ కొనుగోలు చేసిందనీ, దానిని ఎంపీ సంతోష్ రావు, ఆయన అనుచరులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని, నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఫిర్యాదు చేశారు.
దీంతో ఎంపీ సంతోష్ రావుతో బాటు లింగారెడ్డి, శ్రీధర్ అనే వ్యక్తుల మీద మార్చి 21న పోలీసులు 400, 471, 447, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా, రెండు రోజుల ఆలస్యంగా ఇది వెలుగు చూసింది. కబ్జాకు పాల్పడిన సంతోష్ రావు బృందం తమ కంపెనీ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, తాత్కాలికంగా రూమ్‌లు ఏర్పాటు చేశారని ఆ ఫిర్యాదులో మాధవ్ పేర్కొన్నారు.
Read More: తుక్కుగూడ సెంటిమెంట్
భూ కబ్జా ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ రాజ్య సభ ఎంపీ జోగినపల్లి సంతోష్ స్పందించారు. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. షేక్ పేట్‌లో స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి ల్యాండ్ కబ్జా చేశాననేది అవాస్తవమని వివరణ ఇచ్చారు. భూమికి సంబంధించిన విషయంలో న్యాయ పరమైన వివాదం ఉంటే ముందుగా లీగల్ నోటీసులు ఇవ్వాలి గానీ, పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టటం ఏమిటో తనకు అర్థం కాలేదన్నారు.
రాజకీయ కక్షతోనే తనపై బురదజల్లాలని చూస్తున్నారని, ఆధారాలు లేకుండా ఇలా తన ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ కేసులో అరెస్టై ఢిల్లీలో ఈడీ రిమాండ్‌లో ఉండగా, పలువురు బీఆర్ఎస్ నేతలనూ ఈడీ ప్రశ్నించనుందనే నేపథ్యంలో కేసీఆర్ కుటుంబానికి సమీప బంధువైన ఎంపీ సంతోష్ రావు మీద కబ్జాకేసు నమోదు కావటం గులాబీ శ్రేణుల్లో కలవరం కలిగిస్తోంది.