Supreme court | రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఉచితంగా రేషన్, నగదు ఇస్తుండటంతో ప్రజలు పనిచేయకుండా.. బద్ధకస్తులుగా మారుతున్నారని మండిపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు.. ఒకదాన్ని మించి మరొకటి ఉచిత పథకాలు, డబ్బులు ఇస్తామని చెప్పడం దేశ అభివృద్ధికి మంచిది కాదని వ్యాఖ్యానించింది. ఉచిత పథకాలు ప్రజలను సోమరిపోతులుగా మారుస్తుందని.. సమాజానికి ఇలాంటివి మంచివి కావని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
ఉచితంగానే అన్నీ ఇచ్చేసే పద్ధతిని తప్పుబట్టింది ధర్మాసనం. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలన్న పిటిషన్ ను విచారిస్తూ ధర్మాసనం ఇలా స్పందించింది. ఈ పిటిషన్ మీద విచారణను ఆరువారాల పాటు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు (Supreme court) చేసిన కామెంట్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే ఉచితాలపై చాలా రోజులుగా విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ప్రజలను పనిచేయనివ్వకుండా చేస్తున్న పథకాలను తీసేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి.