Telangana Temples: రాష్ట్రంలోని ఆలయాల్లో (Telangana Temples) ధూప దీప నైవేద్యం (డీడీఎన్) పథకం నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. మారుమూల ఆలయాల్లోనూ నిత్యం దీపం వెలగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిధులు ఇస్తుండగా, అవి దుర్వినియోగం అవుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వ హయాంలో అసలు ఆలయమే లేకపోయినా పథకాన్ని వర్తింపజేశారని, కొన్నిచోట్ల గుడి తలుపులు తీయకపోయినా నిధులు డ్రా చేస్తున్నారని మంత్రి సీరియస్ అయ్యారు. ఈ అక్రమాలను అరికట్టి పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ’ (ఎస్ఎస్ఏఏటీ)కి బాధ్యతలు అప్పగిస్తూ వర్క్ ఆర్డర్ జారీ చేసింది. త్వరలోనే ఆడిట్ బృందాలు క్షేత్రస్థాయిలో రికార్డులను, ఆలయాల ఉనికిని పరిశీలించనున్నాయి. తప్పుడు వివరాలతో నిధులు కాజేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
7 కోట్ల నిధులు కేటాయింపు
గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన, ఆదాయం లేని ఆలయాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ధూప, దీప నైవేద్య పథకంలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కనీసం 15 ఏళ్ల చరిత్ర ఉండి, ఏడాదికి రూ. 50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న 6,439 ఆలయాలకు ప్రభుత్వం నెలకు రూ. 10 వేల చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. అయితే, ఈ నిధులు అర్హులైన వారికి అందకుండా కొందరు సిబ్బందితో కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అసలు గుడి లేకపోయినా రికార్డుల్లో ఉన్నట్లు చూపి నిధులు కాజేస్తున్నారని, మరికొన్ని చోట్ల గుడి ఉన్నా పూజలు నిర్వహించకుండానే నిధులు డ్రా చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఒకే అర్చకుడు పలు దేవాలయాల పేర్లతో భృతి పొందుతున్నట్లు, గత ప్రభుత్వంలోని కొందరు ప్రజాప్రతినిధులు సైతం ఈ పథకంలో తమ పేర్లు చేర్చుకుని నిధులు నొక్కుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి పారదర్శకత తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది.
Also Read: Telangana Temples: ప్రజా ప్రభుత్వంలో దేవాలయాలకు పెరిగిన ఆదాయం.. 699 దేవాలయలకు రూ.544.61 కోట్లు!
నిత్య పూజలే లక్ష్యం
డీడీఎన్ పథకం అమలులో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించిన సర్కార్, ఇందుకోసం ఎస్ఎస్ఏఏటీకి వర్క్ ఆర్డర్ ఇచ్చింది. వారం రోజుల్లోనే ఈ ఆడిట్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆడిట్ బృందాలు నేరుగా గ్రామాలకు వెళ్లి రికార్డుల్లో ఉన్న ఆలయాలు అక్కడ ఉన్నాయా? నిత్య పూజలు జరుగుతున్నాయా? అర్చకులు అందుబాటులో ఉంటున్నారా? అనే అంశాలపై గ్రామస్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అక్రమాలు రుజువైతే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, నిరాదరణకు గురవుతున్న ఆలయాల్లో అర్హులైన అర్చకులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు ప్రతి నెలా ఆలయాల నిర్వహణ, భూముల సంరక్షణ, ఈఓల పనితీరుపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ తీసుకుంటున్న ఈ చర్యల వల్ల నిధులు పక్కదారి పట్టకుండా, ఆలయాల్లో నిత్య పూజలు కొనసాగి పూర్వశోభ సంతరించుకుంటుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Telangana Temples: భక్తులకు తప్పిన తిప్పలు.. రాష్ట్రంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం..?

