Ratha Saptami 2026: పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం.. రథసప్తమి వేడుకల కోసం సిద్ధమవుతోంది. జనవరి 25వ తేదీన జరగనున్న ఈ వేడుకల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో రథసప్తమి వేడుకలకు సంబంధించి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు (B.R. Naidu) మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆ రోజున జరగబోయే కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభం
రథసప్తమి రోజున ఏడు వాహన సేవలపై మలయప్ప స్వామిగా శ్రీవారు దర్శనమిస్తారమని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు. జనవరి 25న ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో వాహనసేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంతో ముగిస్తుందని స్పష్టం చేశారు. ‘వైకుంఠ ద్వార దర్శనాలు, బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేశాం. అలాగే రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తాం’ అని బి.ఆర్. నాయుడు అన్నారు.
14 రకాల అన్నప్రసాదాలు..
రథసప్తమి సందర్భంగా ఉండే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకూ సర్వదర్శన టోకెన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. మరోవైపు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 14 రకాల వంటకాలతో అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తామని చెప్పారు. మాడ వీధుల్లో 3700 మంది శ్రీవారి సేవకులతో ఈ అన్నప్రసాదాల పంపిణీ జరగనున్నట్లు తెలిపారు.
Also Read: Jagan on Chandrababu Age: చంద్రబాబు వయసుని మళ్లీ టార్గెట్ చేసిన వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఒకటే చర్చ!
సాంస్కృతిక కార్యక్రమాలు
రథసప్తమి వేడుకల సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లు బి.ఆర్. నాయుడు తెలిపారు. 1260 మంది పోలీసులు, 1200 విజిలెన్స్ సిబ్బంది భద్రతో నిమగ్నమవుతారన్నారు. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సుల 2300 ట్రిపులు తిరుగుతాయని అన్నారు. వీటితో పాటు భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు 56 కళా బృందాల ప్రదర్శన ఉండనున్నట్లు చెప్పారు. కాగా రథసప్తమి వేడుకలకు 2.50 లక్షల మంది భక్తులు హాజరవుతారని టీటీడీ అంచనా వేస్తోంది.

