YS Jagan: భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ఊసరవెల్లి కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడుతుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జగన్.. భూముల రీసర్వే అంశంపై మాట్లాడారు. తమ హయాంలో భూ సర్వేను మహాయజ్ఞంలా మెుదలుపెట్టామని చెప్పారు. దుష్ప్రచారంతో భూ సర్వే క్రెడిట్ ను చంద్రబాబు తన ఖాతాలా వేసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలను ఎంతో కాలం దాచిపెట్టలేరని జగన్ వ్యాఖ్యానించారు.
‘రూ.6,000 కోట్లు ఖర్చు చేశాం’
2019 మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 2020 డిసెంబర్ 21న ఏపీలో భూ సర్వే ప్రారంభించినట్లు వైఎస్ జగన్ అన్నారు. వివాదాలు లేకుండా పారదర్శకంగా భూములను రీసర్వే చేసినట్లు చెప్పారు. భూముల యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు అందించామన్నారు. పాస్ బుక్ లో క్యూఆర్ కోడ్ సైతం పెట్టినట్లు తెలిపారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు.. ఏనాడైనా ఈ ఆలోచన వచ్చిందా అంటూ జగన్ ప్రశ్నించారు. సుమారు 40వేల మంది సిబ్బంది శ్రమ, కృషి.. ఈ భూముల రీసర్వేలో దాగుందని జగన్ అన్నారు. సర్వేల్లో హెలికాఫ్టర్లు, డ్రోన్లను సైతం వినియోగించినట్లు జగన్ తెలిపారు. భూముల రీసర్వేకే రూ.6000 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు.. ఏ రోజైనా భూములు రీ సర్వే ఆలోచన వచ్చిందా.
నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతులు నుంచి వచ్చిన కష్టాలు విన్న తర్వాత వచ్చిన ఆలోచన భూముల రీ సర్వే.
– వైఎస్ జగన pic.twitter.com/9VHODjjghO— ChotaNews App (@ChotaNewsApp) January 22, 2026
పాస్ పుస్తకాల్లో అన్నీ తప్పులే
భూసర్వే క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. సర్వే రాళ్లు లేకుండానే సర్వే చేయిస్తున్నారని విమర్శించారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి.. సర్వే అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ బుక్ లో తాము చేసిందే కూటమి ప్రభుత్వం చేస్తోందని.. మేం ఇచ్చిన వాటికే రంగులు మార్చి ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పైగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులు ఉంటున్నట్లు జగన్ పేర్కొన్నారు. తమ హయాంలో ఇచ్చిన పాస్ బుక్ కు.. ప్రస్తుతం చంద్రబాబు ఇస్తున్న వాటిని పక్కపక్కన పెట్టి మీడియాకు జగన్ చూపించారు.
Also Read: Medaram jatara 2026: భక్తులకు గుడ్ న్యూస్.. మేడారంలో హెలికాప్టర్ రైడ్స్.. ఒక్కొక్కరికి ఎంతంటే?
సర్వే లక్ష్యంగా గాలికి వదిలేసి..
తమ హయాంలో పాతిన రాళ్లపై ఉన్న పేర్లను కూటమి ప్రభుత్వం తొలగిస్తోందని జగన్ అన్నారు. ఇందుకోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. సర్వే అంతిమ లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నీరు గారుస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 22 ఏ గురించి చంద్రబాబు మాట్లాడితే ఆశ్చర్యమేస్తోందన్న జగన్.. అందులో అడ్డగోలుగా భూములను చేర్చిన ఘనత చంద్రబాబుదే అని మండిపడ్డారు. రైతుల నుంచి కమిషన్లు తీసుకొని పట్టాదార్ పాస్ బుక్ లు ఇస్తున్నారని ఆరోపించారు.

