Vanga Geetha: ఏపీ పాలిటిక్స్ చాలా డైనమిక్. ఎప్పటికప్పుడు హాట్ హాట్ నడుస్తుంటాయి. తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్లకుపైగా సమయం ఉంది. అయినా సరే.. ఎక్కడి నుంచి బరిలోకి దిగాలి, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయంపై నేతలు ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు అద్దం పట్టే మరో ప్రచారం ఒకటి రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024లో జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) వైసీపీ తరపున బరిలో నిలిచిన మహిళా అభ్యర్థి వంగా గీత (Vanga Geetha) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ముమ్మరంగా పరిశీలన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే, పోటీ చేసేది వైసీపీ నుంచి కాదని, జనసేనలోకి ఆమె జంప్ అవుతారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ ప్రచారం ఎలా మొదలైంది?, కారణాలు ఏమిటి? అనేది తెలియరాలేదు. కానీ, సోషల్ మీడియా వేదికగా మాత్రం జోరుగా పోస్టులు కనిపిస్తున్నాయి.
Read Also- Political Trolls: హరీశ్ రావు ఎలివేషన్స్‌కు.. సజ్జనార్ బ్రేకులు.. పరువు మెుత్తం పోయిందిగా!
పిఠాపురం కాదు.. కాకినాడ నుంచి?
వంగా గీత వైసీపీ గుడ్‌బై చెప్పి, జనసేనలో చేరబోతున్నారని, ఈ మేరకు బలమైన సంకేతాలు ఉన్నాయంటూ ఈ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు గ్లాస్ పార్టీతో సంప్రదింపులు కూడా జరిగాయనేది సారాంశంగా ఉంది. అయితే, ఈసారి పిఠాపురం నుంచి కాకుండా, కాకినాడ నుంచి ఆమె పోటీ చేసే సూచనలు ఉన్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసినప్పటికీ, రూటు మార్చివేసి.. బలమైన పాత పరిచయాలు ఉన్న కాకినాడ నుంచి పోటీ చేయడం ఉత్తమం అని ఆమె భావిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాల రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ గాసిప్‌గా మారిపోయింది. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌పై వైసీపీ తరపున పోటీ చేసిన వంగా గీత వచ్చే ఎన్నికల్లో కూడా ఆమెనే అభ్యర్థిగా నిలుస్తారని అనిపించేది. కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే మనసు మార్చుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురం నుంచి ఆమె పోటీ చేయకపోతే, వైసీపీ నుంచి తదుపరి ఎవరి పోటీ చేస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వంగా గీత లాంటి సీనియర్ నేత పార్టీ నుంచి బయటకు వెళ్తే వైసీపీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి మరి.
Read Also- Hyderabad Metro: మెట్రో ఫేజ్-2 మీ పలుకుబడిని ఉపయోగించండి.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చిన జగన్
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో పోటీ అత్యంత రసవత్తరంగా సాగింది. ‘పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత’ ప్రచారపర్వం ఉదృతంగా కొనసాగింది. పవన్ తరపున సినీ తారలు సైతం ప్రచారానికి వచ్చారు. దీంతో, బలంగా ఉన్న పవన్ కళ్యాణ్‌పై గీతను గెలిపించుకునేందుకు వైసీపీ అధినేత జగన్ భారీ అస్త్రాన్నే ప్రయోగించారు. వంగా గీతను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే, ఆమెను డిప్యూటీ సీఎం చేసి పంపిస్తానంటూ ఫ్యాన్ పార్టీ అధినేత మాట ఇచ్చారు. కానీ, ఆ వ్యూహం బెడిసికొట్టింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో విజయం సాధించారు. గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వంగీ గీతకు నిరాశే ఎదురైంది. కాగా, ఏకంగా డిప్యూటీ సీఎం చేస్తానంటూ హామీ ఇచ్చిన జగన్ పార్టీకి వంగా గీత నిజంగా దూరమవుతారా?, ఈ ప్రచారంలో నిజమెంత? అనేది తేలాల్సి ఉంది. అయితే, వైసీపీ కేడర్, కార్యకర్తలు మాత్రం ఇదంతా ఫేక్ ప్రచారమంటూ కొట్టిపారేస్తున్నారు. వైసీపీని వీడి ఆమె వెళ్లబోరని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. మరి, ఈ ప్రచారానికి ఎలా ముగింపు పడుతుందో వేచిచూడాలి.

