Bhatti Vikramarka: రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి మహిళల అభ్యున్నతి కోసం ఎంతటి ఆర్థిక భారాన్నైనా మోసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దేందుకు మొదటి ఏడాదిలోనే లక్ష్యాన్ని మించి 26 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని ఆయన గుర్తుచేశారు.
పారిశ్రామికవేత్తలుగా మహిళా సంఘాలు
మహిళలు కేవలం గృహిణులుగా లేదా చిన్న వ్యాపారస్తులుగానే కాకుండా, పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కులలో మహిళలకు ప్రత్యేకంగా బ్లాకులు కేటాయిస్తామని వెల్లడించారు. మహిళా సంఘాలకు అవసరమైన శిక్షణను స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పించి, వారు సొంతంగా పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇప్పటికే కలెక్టరేట్లలో క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల లీజింగ్, పెట్రోల్ పంపుల నిర్వహణ వంటి బాధ్యతలను మహిళలకే అప్పగించి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించామన్నారు.
మధిరలో ఇందిరా మహిళా డైరీ విప్లవం
మధిర నియోజకవర్గంలో మహిళలే వాటాదారులుగా ఆదర్శవంతమైన పాల పరిశ్రమను ప్రారంభించామని భట్టి విక్రమార్క వివరించారు. ఈ ఇందిరా మహిళా డైరీలో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకు రెండు గేదెలు ఇప్పించడంతో పాటు, పాల సేకరణ, అనుబంధ ఉత్పత్తుల విక్రయాల బాధ్యతను కూడా సంఘ సభ్యులకే అప్పగిస్తామన్నారు. నియోజకవర్గంలోని 53 వేల మంది సభ్యులలో ఇప్పటికే 45 వేల మంది ఈ డైరీలో చేరేందుకు ఆసక్తి చూపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?
సోలార్ మోడల్ విలేజ్
బోనకల్లు మండలంలోని రావినూతల గ్రామంలో ‘సోలార్ మోడల్ విలేజ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, ఇది దేశంలోనే ఒక విప్లవాత్మకమైన పథకమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఇల్లు, వ్యవసాయ పంపుసెట్టు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును వాడుకోగా మిగిలిన దానిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 14 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద 1,380 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు వివరించారు.
పేదల సంక్షేమానికి అండగా..
రాష్ట్రంలో సంపదను పెంచి పేదలకు పంచడమే తమ విధానమని, గద్దలు, రాబందులను ప్రజాధనం దరిదాపుల్లోకి రానివ్వబోమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మొదటి దశలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను రూ. 22,500 కోట్లతో నిర్మిస్తున్నామని, మహిళా ప్రయాణికుల కోసం ఆర్టీసీకి ఇప్పటికే రూ. 7,000 కోట్లు చెల్లించామని చెప్పారు. రైతు భరోసా, సన్నబియ్యానికి బోనస్ వంటి పథకాల ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు చేరుస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, ఇప్పుడు అదనంగా మరో 1.98 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ చేతిలో హరీష్ రావు చిట్టా..?

