Phone Tapping Case: హరీశ్ రావుకు సిట్ నోటీసులు
– నేడు ఉదయం 11 గంటలకు విచారణ
– చక్రధర్ ఇష్యూలో తప్పించుకున్నా శ్రవణ్ రావు విషయంలో దొరికిపోయారా?
– కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు
– కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసి ఏం చేశారు?
– సమాచారం ఎక్కడికి చేరవేశారు?
– కేసీఆర్‌కు ఇచ్చారా.. ఇంటెలిజెన్స్ చీఫ్‌కు చెప్పారా?
– విచారణలో ఇలాంటి ప్రశ్నలే ఎదురు కానున్నాయా?
– నెక్ట్స్ విచారణకు రాబోయేది ఎవరు?
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. చక్రధర్ వ్యవహారంలో సుప్రీం క్లీన్ చిట్ ఇవ్వడంతో అంతా సమసిపోయిందని భావించిన బీఆర్ఎస్ వర్గాలకు, ఇప్పుడు శ్రవణ్ రావు వ్యవహారానికి సంబంధించి సిట్ నోటీసులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తున్నది.
11 గంటలకు విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని హరీశ్ రావుకు సిట్ నుంచి సోమవారం నోటీసులు జారీ అయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో శ్రవణ్ రావుతో పాటు ప్రభాకర్ రావును గతంలో సిట్ విచారించింది. వీరితో లింకులకు సంబంధించి హరీశ్ రావును ప్రశ్నించనున్నది. ఉదయం 9 గంటలకు హరీశ్ రావు తెలంగాణ భవన్‌కు రానున్నారు. అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రావాలని సమాచారం వెళ్లింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రానున్నారు. సమావేశం అనంతరం సిట్ విచారణకు హరీశ్ రావు బయలుదేరనున్నారు.
చక్రధర్ ఇష్యూలో క్లీన్‌చిట్.. కానీ..
తన ఫోన్ ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన వ్యాపారి చక్రధర్ గౌడ్ గతంలో పంజాగుట్ట పీఎస్‌లో హరీశ్ రావుపై ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీన్ని సవాల్ చేస్తూ హరీశ్ రావు హైకోర్టుకు వెళ్లగా కేసు కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకున్నది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా విచారణకు స్వీకరిచలేదు. దాంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు క్లీన్‌చిట్ వచ్చేసింది అన్నట్టుగా అటు హరీశ్ రావు, ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాలు తెగ ప్రచారం చేశాయి. కానీ, కొన్ని రోజులకే సిట్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.
Also Read: CM Revanth Reddy: తెలంగాణ మంత్రులకు సీఎం వార్నింగ్.. ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే కుట్ర..?
శ్రవణ్ రావుతో లింకులపై సిట్ ఫోకస్
సిట్ విచారణ సరైన దారిలో వెళ్తుందా అంటూ ఈ మధ్య ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేటివ్ కథనాన్ని ప్రచురించింది. గతంలో విచారించిన వారినే మళ్లీ విచారించడం, శ్రవణ్ రావు లింకులపై ఫోకస్ చేయకపోవడాన్ని ప్రశ్నించింది. అయితే, ఇప్పుడు సిట్ అధికారులు హరీశ్ రావుకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు శ్రవణ్ రావుతో కలిసి హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి సిట్ ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
హరీశ్ రావుకు ఎదురయ్యే ప్రశ్నలు ఇవేనా?
గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. దీనికి సంబంధించి ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావును అధికారులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ప్రభాకర్ రావును కూడా కోర్టు అనుమతితో ప్రశ్నించారు. శ్రవణ్ రావును సైతం విచారించారు. ఇప్పుడు హరీశ్ రావును శ్రవణ్ రావు, ప్రభాకర్ రావుతో ఇన్న లింకులపైనే ప్రశ్నించనున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేయడంలో శ్రవణ్ రావుకు ఎప్పటికప్పుడు పోలీసులకు మధ్యవర్తిగా వ్యవహరించారని హరీశ్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. సేకరించిన సమాచారాన్ని ఎవరికి చేర వేశారు? కేసీఆర్‌కు ఇచ్చారా? ఓ పత్రిక ఓనర్‌కు చేర వేశారా? ఇంటెలిజెన్స్ చీఫ్‌కు అందజేశారా? అనే అంశాల చుట్టూ సిట్ ప్రశ్నలు ఉండనున్నాయని సమాచారం.
Also Read: BRS Complaint on CM: సీఎంపై చర్యలు తీసుకోండి.. డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఫిర్యాదు

