NTR – Bharat Ratna: దేశంలో అత్యంత బలమైన ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో తెలుగు దేశం (Telugu Desam Party) ఒకటి. తెలుగు జాతీ ఆత్మ గౌరవం అన్న నినాదంతో నందమూరి తారకరామారావు ఈ పార్టీని స్థాపించారు. 9 నెలల కాలంలోనే ఎంతో బలమైన కాంగ్రెస్ పార్టీని ఓడించి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి సైతం అయ్యారు. అప్పట్లో ఆయన ప్రధాని కూడా అవుతారన్న ప్రచారం జరిగింది. అటువంటి ఎన్టీఆర్ కు ఇప్పటివరకూ భారతరత్న రాకపోవడం నందమూరి కుటుంబానికి, టీడీపీ శ్రేణులకు తీరని లోటుగా ఉంటూ వస్తోంది. ఆదివారం (జనవరి 18న) ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోమారు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ కు భారతరత్న సాధిస్తామని ఎప్పటిలాగే ఈ వర్ధంతికి కూడా ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ప్రకటన చేశారు. అసలు ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా ఆపింది ఎవరు? ఇన్నాళ్లు ఎందుకు ఇవ్వలేదు? అన్న ప్రశ్నలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.
చంద్రబాబు గట్టిగా ప్రయత్నించలేదా?
ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సమయాల్లో కచ్చితంగా ఈ భారతరత్న అంశం తెరపైకి వస్తుంటుంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా తలుచుకొని ఉంటే ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోదా అన్న ప్రశ్న చాలా మంది నుంచి వినిపిస్తోంది. భారతరత్న రాకుండా అసలు ఆపగలిగిన వారు ఎవరు? అన్న ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోంది. వాస్తవానికి ఎన్టీఆర్ కు భారత రత్న ఇప్పించుకోగల స్థితి చంద్రబాబు రెండుసార్లు వచ్చిందని అంతా చెబుతుంటారు. 1996 లోక్ సభ ఎన్నికల తర్వాత ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ కూటమికి చంద్రబాబే కన్వీనర్ గా వ్యవహరించారు. హెచ్.డి దేవేగొడ, ఐ.కె. గుజ్రాల్ వంటి వారు ప్రధానులుగా వ్యవహరించడంలో ముఖ్యభూమిక పోషించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో చంద్రబాబు ఉన్నారు. అప్పుడే పట్టుబట్టి ఉంటే ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది.
వాజ్ పెయీ హయాంలో సెకండ్ ఛాన్స్..
1999-2004 మధ్య వాజ్ పెయీ ప్రధానిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలోనూ చంద్రబాబు ముఖ్యభూమిక పోషించారు. ఆ సమయంలోనూ చంద్రబాబు గట్టిగా పట్టుబట్టి ఉంటే ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చి ఉండేదన్న ప్రచారమూ ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 2004-14 ప్రాంతంలో అధికారంలో రావడంతో సహజంగానే ఆ పార్టీకి ఎన్టీఆర్ మీద కాస్త వ్యతిరేకత ఉండేది. కాబట్టి ఆ సమయంలో భారతరత్న ప్రస్తావనే పెద్దగా తెరపైకి రాలేదు. అయితే కాంగ్రెస్ హయాంలో ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. కేంద్ర కేబినేట్ లో ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. 2014లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ సైతం ఈ కూటమి ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉంది. అయితే బీజేపీకి మిత్రపక్షాల అవసరం లేకుండానే సొంతంగానే మెజారిటీ రావడంతో.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం చంద్రబాబుకు లేకుండా పోయిందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
మరి ఈసారైనా సాధిస్తారా..?
ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ముఖ్య భూమిక పోషిస్తోంది. టీడీపీ ఎంపీల మద్దతుతోనే నరేంద్ర మోదీ.. ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు భారతరత్న సాధించేందుకు ఇదే మంచి సమయమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వకుంటే తమ మద్దతు ఉపసింహరిస్తామని చంద్రబాబు గట్టిగా చెప్పగలిగితే.. మోదీ ససేమీరా అనేందుకు అవకాశమే ఉండదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తామని చెబుతున్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు వేయడం లేదని టీడీపీ వ్యతిరేక పక్షాలు ఆరోపిస్తున్నాయి. భారతరత్న విషయంలో చంద్రబాబు కావాలనే నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
Also Read: Phone Tapping Case: రెండేళ్ల నుంచే ఒకటే డ్రామా.. ఇంకెన్నాళ్లు ఈ సీరియల్.. సీఎంపై హరీశ్ రావు ఫైర్!
లక్ష్మీ పార్వతి ఓ కారణమా?
ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోవడం వెనుక పరోక్షంగా లక్ష్మీ పార్వతి (Lakshmi Parvati) ఓ కారణమన్న ప్రచారం రాజకీయంగా సాగుతోంది. వాస్తవానికి భారతరత్న ప్రకటించినప్పుడు.. గ్రహీత మరణించిన సందర్భాల్లో ఆయన జీవిత భాగస్వామికి రాష్ట్రపతి చేతుల మీదగా ఆ పురస్కారాన్ని అందజేస్తారు. ఎన్టీఆర్ ను లక్ష్మీ పార్వతి రెండో వివాహం చేసుకున్నందున ఒకవేళ భారతరత్న ప్రకటిస్తే.. ఆమెకే నేరుగా రాష్ట్రపతి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు, నారా లోకేశ్ తో పాటు నందమూరి కుటుంబం ఆమె పక్కన నిలబడాల్సిన పరిస్థితి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలా జరగడం ఇష్టంలేకనే.. భారతరత్న కోసం టీడీపీ గట్టిగా పట్టుబట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెుత్తానికి ఈసారి కూడా భారతరత్న అంశం ఒక చర్చగా ఉంటుందా? లేదా కోట్లాది మంది తెలుగు ప్రజల కల సాకారం అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

