Ration Rice Scam: ప్రభుత్వ ఆలోచనలకు విరుద్దంగా వ్యవహారిస్తున్న రేషన్ దుకాణదారులు
–అర్బన్ ప్రాంతంలోని రేషన్ షాపు డిలర్లరే నగదు పంపిణీ చేస్తున్న వైనం
–నెలలో మొదటి పది రోజుల్లొ కొంత మంది ఈ బియ్యంపైనే దృష్టి
–చర్యలు తప్పవంటున్న అధికారులు.. పట్టించుకోని వినియోగదారులు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: పేదవాడి కడుపు నింపాలని సర్కారు ముచ్చటపడి సన్నబియ్యం పంపిణీ చేస్తే.. ఆ బియ్యం గింజలు ఇప్పుడు పేదోడి పొయ్యిలోకి వెళ్లడం లేదు సరికదా.. అక్రమార్కుల జేబుల్లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సన్న బియ్యం ఇస్తున్నామని ప్రభుత్వం గర్వంగా చెబుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ‘సరుకు’ సరాసరి బ్రోకర్ల చేతుల్లోకి మళ్లుతోంది. కోట్లాది రూపాయల ప్రజా ధనం ఇలా పక్కదారి పడుతుంటే, అడ్డుకోవాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇక్కడ బియ్యం గింజలు కాదు.. ప్రభుత్వ ఆశయాలే మాయమవుతున్నాయి. ప్రజలు ఫ్రీగా వచ్చే సన్న బియ్యం రేషన్ డీలర్ల వద్ద తీసుకొని బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 20 నుంచి రూ. 30ల వరకు విక్రయిస్తుండటం విచారకరం.
బియ్యం ఇవ్వరు.. పైసలిస్తారు!
నిన్న, మొన్నటి వరకు లబ్ధిదారులు బియ్యం తీసుకొని ఇతరులకు విక్రయిస్తే… ఇప్పుడు ఏకంగా రేషన్ డీలర్లు అమాయక ప్రజలను మభ్య పెట్టి కొత్త దందాకు తెర లేపారు. ఏకంగా రేషన్ దుకాణానికి రావాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి, లబ్ధిదారులకు కిలోకు రూ. 10 నుంచి రూ. 15ల వరకు డీలర్లు నగదు చెల్లించడం విడ్డూరంగా ఉంది. ఈ వ్యవస్థ రంగారెడ్డి అర్బన్ ప్రాంతమైన హయత్ నగర్, సరూర్ నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, గండీపేట్, శేరిలింగంపల్లి మండలాల పరిధిలో అత్యధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత మూడు నెలల క్రితం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి పరిధిలోని ఓ రేషన్ డీలర్ నేరుగా లబ్ధిదారులకు బయోమెట్రిక్ తీసుకొని నగదు చెల్లిస్తున్నారు. నిల్వ ఉండని బియ్యం దుకాణానికి లబ్ధిదారులు చేరుకొని నగదు తీసుకుంటున్నారు. కేవలం సాయంత్రం సమయంలోనే షాపు తీస్తూ, నెల మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండటం గమనార్హం.
Also Read: DGP Office Scandal: డీజీపీ ఆఫీసులో రాసలీలలు.. వైరలవుతున్న వీడియో.. సీఎం సీరియస్!
పెత్తందార్ల పాలు..
ప్రభుత్వం కోట్లు వెచ్చించి పేదోడి ఆకలి తీర్చాలని పంపిణీ చేసే బియ్యం.. అర్ధాకలితో ఉన్న వారికి చేరడం లేదు సరికదా, పక్కాగా అక్రమ మార్గం పడుతోంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 2126 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికే చేరాలి. కానీ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన ఉండటంతో, అవసరం లేని వారు కూడా బియ్యం తీసుకొని యధేచ్ఛగా విక్రయిస్తున్నారు. పంపిణీ చేస్తున్న బియ్యంలో దాదాపు 40 నుంచి 50 శాతం మాత్రమే వినియోగం అవుతుండటం, మిగిలిన సగం బియ్యం రీ-సైక్లింగ్ మాఫియా పాలు కావడం గమనార్హం.
క్రయవిక్రయాలపై నిఘా..
ఈ భారీ గోల్‌మాల్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్‌గా దృష్టి సారించింది. పంపిణీ చేసిన బియ్యం లబ్ధిదారులు సొంత అవసరాలకే వాడుకోవాలని, లేనిపక్షంలో తీసుకోవడం మానేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లతో చేతులు కలిపి వచ్చిన సరుకును వచ్చినట్లే గోదాములకు తరలిస్తున్న తీరుపై సివిల్ సప్లయ్ అధికారులు నిఘా పెంచారు. రేషన్ డీలర్లు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై వచ్చిన బియ్యం వచ్చినట్లే గోదాంలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని సివిల్ సప్లయ్ అధికారులు ప్రతి రేషన్ దుకాణంపై నిఘా పెట్టినట్లు సమాచారం. బహిరంగ మార్కెట్లో రేషన్ బియ్యం విక్రయాలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ప్రతి దుకాణాన్ని తనిఖీ చేస్తూ అక్రమార్కుల ఆట కట్టిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: Anasuya Bharadwaj: హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష బిల్.. అనసూయ షాకింగ్ పోస్ట్!

