Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావుకు సిట్ (SIT) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు సిట్ ముందు విచారణకు హరీశ్ రావు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద హరీశ్ రావు మాట్లాడారు. సిట్ విచారణకు హాజరవుతున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో తమపై ప్రభుత్వం జరుపుతున్న న్యాయపరంగా ఎదుర్కొంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
సిట్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్
సోమవారం తాను సిద్ధిపేటలో ఉండగా సిట్ నోటీసులు వచ్చాయని హరీశ్ రావు తెలిపారు. చట్టాన్ని గౌరవించి రాత్రి సిద్దిపేట నుంచి నేడు సిట్ విచారణకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్తి బాగోతం, సింగరేణి బొగ్గు స్కామ్, మంత్రుల వాటాల గురించి బయటపెట్టానని గుర్తుచేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందన్న భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి సిట్ నోటీసుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ మెుదలు పెట్టారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల ముందు ఈ-కార్ రేసు కేసుకు సంబంధించి ఇదే తరహాలో కేటీఆర్ కు సైతం నోటీసులు ఇచ్చారని హరీశ్ రావు గుర్తుచేశారు.
రెండేళ్లుగా ఇదే డ్రామాలు..
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో గత రెండేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు అడుతోందని హరీశ్ రావు మండిపడ్డారు ‘గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే సుప్రీం కోర్టు చెంప చెల్లుమనే తీర్పు ఇచ్చింది. న్యాయం మా వైపు ఉంది కాబట్టి హైకోర్టులో కూడా గెలిచాం. ఇదే సీరియల్ ఎన్ని రోజులు నడుపుతావు. నువ్వు ఎన్ని డైవర్షన్లు చేసినా నీ బొగ్గు స్కాం, పవర్ స్కాం, హిల్ టీపీ స్కాం బయటపెడతాం. ఆంధ్రాకు అమ్ముడు పోయిన దానిపై నిలదీస్తూనే ఉంటాం. బొగ్గు స్కాంపై నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తా. కాంగ్రెస్, బిజేపీ కుమ్మక్కు అయ్యింది నిజం కాకుంటే సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తా’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ చేతిలో హరీష్ రావు చిట్టా..?
కిషన్ రెడ్డికి సూటి ప్రశ్నలు
సీఎం రేవంత్ రెడ్డి, తన బామ్మర్దితో కలిసి చేస్తున్న స్కాం ఎలా జరిగిందో సీబీఐతో విచారణ జరిపించాలని హరీశ్ రావు పట్టుబట్టారు. ‘నైనీ బ్లాక్ ఒక్కటే కాదు, అన్ని టెండర్లు రద్దు చేయాలి. సిబిఐ విచారణ జరపాలి. వెంటనే బీజేపీ స్పందించాలి. దొంగలను అరెస్టు చేయాలని, అవినీతి సొమ్మును కక్కించాలని డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి డబ్బుతో రేవంత్ ఫుట్ బాల్ ఆడుతున్నాడు. సోకుల కోసం సింగరేణి డబ్బులు ఖర్చు చేస్తుంటే ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడట్లేదు’ అని నిలదీశారు. సిట్ విచారణ గురించి తాను భయపడనని.. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వెళ్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

