CM Revanth Reddy: రాష్ట్ర అభివృద్ధి నిమిత్తం పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, అధికారుల బృందం దావోస్ పర్యటనకు వెళ్లారు.
మేడారం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు
సోమవారం ఉదయం మేడారంలో పునఃనిర్మించిన సమ్మక్క సారలమ్మ గద్దెలకు పూజలు చేసి మహా జాతరను ప్రారంభిoచిన తర్వాత సీఎం రేవంత్ నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి దోవోస్ పర్యటనకు తన బృందంతో కలిసి వెళ్లారు. జనవరి 20 నుంచి 4 రోజులపాటు దావోస్‌లో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు.
దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు
ఈ మధ్యే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఆ డాక్యుమెంట్‌ను ప్రదర్శించనున్నారు. దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, ఎల్‌ఓరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం విడివిడిగా భేటీ కానున్నారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొననున్నారు.
పెట్టుబడుల వేట
తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను, రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పనున్నారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024లో రూ.40,232 కోట్లు, 2025లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను దావోస్ వేదికగా తెలంగాణతో ఒప్పందాలు చేసుకునేలా చేసిన రేవంత్ రెడ్డి, ఈసారి అంతకుమించి అనేలా పెట్టుబడుల వరద పారించాలని చూస్తున్నారు.
Also Read: Anasuya Bharadwaj: హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష బిల్.. అనసూయ షాకింగ్ పోస్ట్!

