BRS Complaint on CM: బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revath Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఉన్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సోమవారం అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు (BRS Complaint on CM) చేశారు. ఈ సందర్బంగా దాసోజు మాట్లాడుతూ రాజ్యాంగం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. సమాజంలో హింస, రాజకీయ విద్వేషాలు పెంచేలా మాట్లాడారని, సీఎం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలను ప్రచారం చేసిన మీడియా, సోషల్ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు యాదగిరి గౌడ్, తదితరులు ఉన్నారు.
తెలంగాణ అస్థిత్వ శిఖరం బీఆర్ఎస్ పార్టీ: సబితఇంద్రారెడ్డి.
బాలాపూర్, స్వేచ్చ: ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా ఖండించారు. ‘‘తెలంగాణ సమాజం గర్వంగా నిర్మించుకున్న అస్థిత్వ చిహ్నాలను, బీఆర్ఎస్ గద్దెలను కూల్చుతామనడం రేవంత్ రెడ్డి అవివేకానికి, రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట’’ అని ఆమె విమర్శించారు. ‘‘తెలంగాణ అంటేనే ఒక పోరాటం, ఒక ఆత్మగౌరవం. ఆ అస్థిత్వాన్ని కాపాడటానికే పుట్టిన పార్టీ బీఆర్ఎస్. గద్దెలు కూల్చుతామన్న రేవంత్ రెడ్డి మాటలు అర్ధరహితం. ప్రజల గుండెల్లో కొలువుదీరిన ఉద్యమ స్ఫూర్తిని కూల్చడం ఎవరి తరమూ కాదు. అబద్ధపు హామీలు, దుష్ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నైజం ప్రజలకు అర్థమైందని, బీఆర్ఎస్ గద్దెలను కాదు, ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వంద మీటర్ల లోతున బొందపెట్టడం ఖాయం’’ అని సబిత పేర్కొన్నారు.
Read Also- Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?
నాడు కాంగ్రెస్, టీడీపీల వివక్ష కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, ఆ పార్టీల దగా వల్లే వందలాది మంది బిడ్డలు అమరులయ్యారని ఆమె అన్నారు. నేడు మళ్లీ అదే టీడీపీ పట్ల రేవంత్ రెడ్డి కురిపిస్తున్న మొసలి కన్నీరు తెలంగాణ ద్రోహానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. ‘‘రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ మనిషా లేక టీడీపీ కోవర్టా? అనేది తేల్చుకోవాలి. టీడీపీ ఏ కూటమిలో ఉందో తెలియని పరిస్థితిలో ఉంటూ, ఓట్ల కోసం నాటకాలు ఆడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు’’ అని ఆమె పేర్కొన్నారు. సీఎం హోదాలో ఉండి ‘చిల్లర కూతలు’ కూయడం రేవంత్ రెడ్డి మానసిక స్థితికి అద్దం పడుతోందని, సొంత మంత్రులతో ఉన్న విభేదాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికే ఇటువంటి అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు.. అధికార గర్వంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణ అస్థిత్వంపై దెబ్బకొట్టాలని చూస్తే కాలమే సరైన గుణపాఠం చెబుతుందని ఆమె వార్నింగ్ ఇచ్చారు.
Read Also- Medchal News: మేడ్చల్లో 2 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన అధికారులు

