Crorepati Beggar: అతనొక రోడ్డుపై యాచించి బతికే భిక్షగాడు. ఆయన చూస్తే ఎవరైనా జాలి పడాల్సిందే. నేలపై జారుతూ వెళ్లే బేరింగ్‌ల ఇనుప బండిపై కూర్చొని అడుక్కుంటుంటాడు. తనను తాను నెట్టుకుంటూ ధీనంగా అడుక్కుంటూ కనిపిస్తుంటాడు. నోరెత్తి ఎవర్నీ పెద్దగా అడగడు. కానీ, ఆయన ఆహార్యాన్ని చూసి జాలి పడి చాలా మంది భిక్షం వేస్తుంటారు. కానీ, రోడ్డుపై అడ్డుక్కునే ఆ వ్యక్తి ఒక కోటీశ్వరుడని, అతడి ఆస్తుల చిట్టా పెద్దదని తెలిసి జనాలంతా షాక్ అవుతున్నారు.
ఇండోర్‌లో రద్దీగా ఉండే సరాఫా బజార్‌లో ప్రాంతంలో అడుక్కునే మాంగీలాల్ అనే యాచకుడు కోటీశ్వరుడు అని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. శారీరకంగా వికలాంగుడైన అతడికి ఏకంగా మూడు ఇళ్లు ఉన్నాయి. అందులో ఒకటి ప్రభుత్వం కేటాయించింది. ఇక ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ఆటోలు అతడికి ఉన్నాయి. అంతేనా, ఒక మారుతీ సుజుకి డిజైర్ కారు కూడా ఉంది. ఇండోర్ నగరాన్ని భిక్షగాళ్ల రహిత నగరంగా మార్చేందుకు అక్కడి ప్రభుత్వం ఒక ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది.
కుష్టు వ్యాధి ఉన్న ఓ వ్యక్తి సరాఫా ప్రాంతంలో ప్రతిరోజూ భిక్షాటన చేస్తున్నాడంటూ సమాచారం అందడంతో శనివారం రాత్రి రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి, అతడిని అదుపులోకి తీసుకుంది. ఏదో సాధారణ భిక్షగాడని భావించిన అధికారులు.. ఆ తర్వాత అతడి ఆస్తుల చిట్టా గురించి తెలిసి నోరెళ్లబెట్టారు.
భిక్షాటనలో ఆరితేరాడు
మాంగీలాల్ భిక్షాటనలో ఆరితేరిపోయాడు. మౌనంగా బిక్షాటన చేయడం అతడి స్పెషాలిటీ. ఎప్పుడూ ఎవరినీ చేయి చాచి అడగడు. ఇనుప బండిపై అలా ధీనంగా కూర్చొని, సానుభూతి వల వేసి సంపాదిస్తాడు. కేవలం బిక్షం రూపంలో రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదిస్తుంటాడట.
Read Also- Eco Park Scam: ఎక్స్ పీరియం ఎకో పార్క్ యజమాని ఘరానా మోసం.. లీజు పేరుతో లాగేసుకున్న పేదల భూమి..?
చీకటి పడ్డాక అసలు వ్యాపారం
రోజంతా అడుక్కొని సంపాదించే మంగీలాల్ చీకటి పడ్డాక అసలు వ్యాపారం మొదలుపెడతాడట. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును అవసరాల కోసం వాడుకోకుండా, అదే సరాఫా బజార్‌లోనే వడ్డీ వ్యాపారం చేసేవాడట. లోకల్ వ్యాపారులకు రోజువారీ, లేదా వారాల లెక్కన వడ్డీకి అప్పులు ఇచ్చేవాడట. వడ్డీకి ఇచ్చిన డబ్బులను సాయంత్రం స్వయంగా తానే వెళ్లి వసూలు చేసేవాడు. మార్కెట్లో వడ్డీల రూపంలో దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు తిప్పుతున్నాడంటే అతడి ఆదాయం ఎంతో అర్థం చేసుకోవచ్చు. వడ్డీ, భిక్షాటన కలిపి రోజుకు 1,000 రూపాయలకు తగ్గకుండా, గరిష్టంగా 2,000 వరకు సంపాదిస్తున్నాడని అధికారులు లెక్కగట్టారు.
అతడికి ఉన్న మూడు ఇళ్లు కూడా ఖరీదైన ప్రాంతాల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందులో ఒకటి మూడంస్తుల బిల్డింగ్ అని, మిగిలిన 2 ఇళ్లు కూడా మంచి వసతులు ఉన్నవేనని పేర్కొన్నారు. ఇక, ఆటోలను రోజువారీ కిరాయికి ఇస్తాడని వివరించారు. కారును కూడా ఆదాయం కోసం ఉపయోగిస్తుంటాడని తెలిపారు. ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ తన అంగవైకల్యాన్ని చూపించి ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద ఒక బెడ్‌రూమ్ ఇంటిని పొందాడని తెలిపారు. కాగా, మంగీలాల్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రస్తుతం ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం మంగీలాల్ బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులపై విచారణ జరుగుతోందని, వడ్డీకి డబ్బు తీసుకున్న వ్యాపారులను కూడా ప్రశ్నిస్తామని అధికారులు తెలిపారు.

