NTR Statue Controversy: ఎన్టీఆర్ విగ్రహంపై రాజకీయ రగడ
NTR Statue Controversy in Amaravati (Image Source: AI and X)
Political News

NTR Statue Controversy: అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. వైసీపీ వింత వాదన.. ఎక్కడో కొడుతుంది సీనా?

NTR Statue Controversy: ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంలో మరింత దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు జాతి ఖ్యాతిని దిల్లీ స్థాయిలో మార్మోగేలా చేసిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 167 ఎకరాల స్థలంలో ‘తెలుగు వైభవం – తెలుగు తేజం’ పేరిట స్మృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ 182 మీటర్ల ఎత్తైన అతి భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు రూ.1750 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం అధికార టీడీపీ, వైసీపీ మధ్య వివాదానికి కారణమైంది. ప్రజాధనంతో టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

వైసీపీ వాదన ఏంటంటే?

అమరావతిలో రూ.1750 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ విగ్రహాం ఏర్పాటు చేయడమంటే ప్రజా ధనాన్ని వృధా చేయడమేనని వైసీపీ వాదిస్తోంది. ఎన్టీఆర్ పై అంతగా ప్రేమ ఉంటే.. విగ్రహ నిర్మాణం వ్యయాన్ని నందమూరి కుటుంబమే భరించాలని డిమాండ్ చేస్తోంది. తెలుగు జాతికి రామారావు గర్వకారణమన్న విషయాన్ని తాము అంగీకరిస్తామన్న వైసీపీ నేతలు.. అయితే రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఈ సమయంలో విగ్రహ ఏర్పాటుకు రూ.వేల కోట్లు ఖర్చు చేయడం మాత్రం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేస్తోంది. రామారావు కుటుంబ సభ్యులందరూ ధనవంతులేనని.. వారందరూ తలా రూ.100 కోట్లు వేసుకున్నా.. విగ్రహం నిర్మాణం పూర్తి అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. లేదంటే రామారావు అల్లుడు చంద్రబాబు, కూతురు భువనేశ్వరి రూ.లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు తమ సొంత డబ్బుతో భారీ ఎన్టీఆర్ విగ్రహం నిర్మిస్తే తాము స్వాగతిస్తామని చెబుతున్నారు. లేదంటే తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి తెలుగు దేశం పార్టీ (TDP)నే ఈ ఆర్థిక భారాన్ని భరించాలని వైసీపీ అంటోంది.

వైఎస్ విగ్రహం సంగతేంటి?

ప్రజాధనం తమ చేతుల్లో ఉంది కదా అని ఇష్టారీతిన విగ్రహం ఏర్పాటు చేయడం సరైంది కాదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నామని ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే.. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ విగ్రహం సంగతేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు కాపులు నుంచి సైతం వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్స్ కూడా పుట్టుకొచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వివాదం చెలరేగిన నేపథ్యంలో స్మృతి వనం ప్రాజెక్టును నిలిపివేయడం మంచిదని హితవు పలుకుతున్నారు. గుజరాత్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని గతంలో చంద్రబాబు వ్యతిరేకించిన అంశాన్ని వైసీపీ శ్రేణులు తెరపైకి తీసుకొస్తున్నారు. చంద్రబాబే కాకుండా టీడీపీ ఎంపీలు సైతం విగ్రహాల ఏర్పాటును గతంలో లోక్ సభ వేదికగా విమర్శించారని గుర్తుచేస్తున్నారు.

Also Read: Komatireddy IAS Issue: మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ ఎన్టీవీ వివాదం.. తెర వెనుక ఇంత కుట్ర దాగుందా?

టీడీపీ శ్రేణుల స్ట్రాంగ్ కౌంటర్..

ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ చేస్తున్న రాజకీయ రగడను టీడీపీ శ్రేణులు తిప్పిగొడుతున్నారు. జగన్ హయాంలో పెద్ద ఎత్తున గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ బుద్ధి ఏమైందని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాలన్నీ వైసీపీ తన సొంత నిధులతోనే ఏర్పాటు చేసిందా? అని నిలదీస్తున్నారు. మరోవైపు ప్రజాధనం దుర్వినియోగం గురించి వైసీపీ మాట్లాడటం వింతగా ఉందంటూ నెట్టింట టీడీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. విశాఖలో రుషికొండ ప్యాలెస్ కు రూ. వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు ఈ ఆలోచన ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. మెుత్తంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలను వారికే టీడీపీ ఎక్కుపెడుతుండటం.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. విగ్రహం ఏర్పాటు అంశం.. ఏపీ రాజకీయాల్లో మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ మెుదలైంది.

Also Read: Honeytrap Couples: 1500 మందిని హనీ ట్రాప్.. 100 మందితో శృంగారం.. ఈ కపుల్ సమాజానికే సిగ్గుచేటు!

Just In

01

Lucky Draw Scam: నిన్న బెట్టింగ్ యాప్స్.. నేడు లక్కీ డ్రా.. ఆశపడ్డారో జేబులు గుల్లే!

NTR Death Anniversary: ఆయనలా స్వార్థం లేకుండా ఈ రోజున రాజకీయం చేయగలరా?

Bhatti Vikramarka Row: భట్టిపై ఓ పత్రిక అవినీతి ఆరోపణలు.. అసలేంటీ ‘ఫీల్డ్ విజిట్’ నిబందన?. అనుమానాలివే!

Assembly Session: ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు.. ఈసారి జగన్ రావాల్సిందేనా? లేదంటే సీటు గల్లంతేనా?

Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేష్ పాదయాత్ర.. ఎందుకో తెలుసా?