Komatireddy IAS Issue: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)పై ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్టీవీ (NTV) ప్రసారం చేసిన కథనం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహిళా ఐఏఎస్ లతో మంత్రికి నీచమైన సంబంధాలు అంటకట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారిణుల్లో ఒకరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన సిట్.. తప్పుడు వార్తను ప్రసారం చేసిన సదరు ఛానల్ జర్నలిస్టులను అరెస్టు కూడా చేశారు (ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు). అయితే మంత్రిపై ఈ బురద జల్లే కథనం వెనుక అసలు కుట్ర ఇదేనంటూ మరో ప్రముఖ వార్త సంస్థ తన వీకెండ్ ఎపిసోడ్ లో బయటపెట్టింది. పలు కీలక విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఇవి కూడా రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి.
నైనీ బొగ్గు బ్లాక్ కేంద్రంగా..!
ప్రముఖ వార్త సంస్థ ప్రసారం చేసిన వీకెండ్ ఎపిసోడ్ ప్రకారం.. మంత్రి కోమటిరెడ్డిపై వచ్చిన విష కథనం వెనుక భారీ కుట్రనే ఉంది. ఒడిశా నైనీ బొగ్గు బ్లాక్ కేంద్రంగా ఈ వెగటు పుట్టించే కథను మీడియాలో ప్రసారం చేసినట్లు సదరు మీడియా ఆరోపించింది. దాని కథనం ప్రకారం.. ఒడిశా నైనీ బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కింది. ఈ టెండర్లు దక్కించుకునేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎన్టీవీ ఎండీ నరేంద్ర చౌదరి అల్లుడుకి చెందిన వెన్సర్ కంపెనీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వీరికి బొగ్గు తవ్వకాల్లో అనుభవం లేకపోవడంతో ఈ ఫీల్డ్ లో అనుభవం ఉన్న మేఘా కంపెనీతో వారు జత కట్టారట. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ టెండర్ ను తన సోదరుడికి చెందిన సుశీ కంపెనీకి దక్కేలా పావులు కదుపుతున్నారు.
టెండర్‌ను అడ్డుకున్న కోమటిరెడ్డి!
వాస్తవానికి కేసీఆర్ హయాంలోనే నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ అంశం తెరపైకి వచ్చింది. 25 ఏళ్ల పాటు బొగ్గును తవ్వుకొని.. డబ్బు సంపాదించే బంగారం లాంటి అవకాశం ఉండటంతో ఓ ప్రైవేటు కంపెనీకి దారదాత్తం చేయాలని కేసీఆర్ అప్పట్లోనే ప్లాన్ చేసినట్లు వీకెండ్ ఎపిసోడ్ లో సదరు మీడియా పేర్కొంది. అదానీని ముందుపెట్టి ప్రతిమ శ్రీనివాస్ కంపెనీకి దానిని అప్పగించే ప్లాన్ కూడా చేశారని ఆరోపించింది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంటరై కేసీఆర్ ప్లాన్ ను చెడగొట్టారని.. ప్రధాని మోదీని అప్పట్లోనే కలిసి అడ్డుకున్నారని రాసుకొచ్చింది. ప్రస్తుతం సింగరేణి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిధిలోనే ఉంది. ఈ క్రమంలోనే కొత్త కంపెనీలు సైతం టెండర్ దక్కించుకునేందుకు వీలుగా సింగరేణి కంపెనీ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. క్షేత్ర సందర్శన చేసిన కంపెనీ మాత్రమే టెండర్ లో పాల్గొనాలని షరతు పెట్టింది. అయితే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ను తాము అనుకున్న జాయింట్ వెంచర్ కంపెనీకే ఇచ్చి బలమైన కంపెనీలను టెండర్ల నుంచి దూరం పెట్టాలని దీని వెనకున్న అసలు ప్లాన్ అని వీకెండ్ ఎపిసోడ్ లో సదరు మీడియా సంస్థ ఆరోపించింది.
Also Read: Seethakka: మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క!
తన అల్లుడి కోసమే అసభ్య కథనం!
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడికి చెందిన సుశీ కంపెనీకి బొగ్గు తవ్వకాల్లో ఇప్పటికే అపారమైన అనుభవం, కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయి. దీనికి తోడు గతంలోనూ ఈ టెండర్ కేసీఆర్ కు దక్కకుండా అడ్డుపడిన అనుభవం ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో తన అల్లుడు భాగస్వామిగా ఉన్న వెంచర్ కంపెనీకి ఎక్కడ టెండర్ దక్కదేమోనన్న ఆందోళనతో ఎన్టీవీ ఎండీ నరేంద్ర చౌదరి.. మంత్రి కోమటిరెడ్డిపై తన ఛానల్ లో విషప్రచారానికి తెరలేపారని తన వీకెండ్ ఎపిసోడ్ లో సదరు వార్త సంస్థ ఆరోపించింది. మహిళా ఐఏఎస్ లతో అక్రమ సంబంధాలను అంటగట్టి.. రోత కథనాన్ని ప్రసారం చేసిందని చెప్పుకొచ్చింది. దీనిపై కేంద్ర సర్వీస్ అధికారులందరూ సీరియస్ అవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండానే అధికారులు సిట్ ఏర్పాటు చేసుకున్నారని వార్త సంస్థ తెలిపింది. చూసి చూడనట్లు పోవాలని భట్టి చెప్పినప్పటికీ అధికారులు వినిపించుకోలేదని తన వీకెండ్ ఎపిసోడ్ లో రాసుకొచ్చింది. అయితే సదరు వార్త సంస్థ కథనంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది.

