New District Demand: హుజురాబాద్‌ను కేంద్రంగా చేసుకొని ప్రత్యేక ‘పీవీ జిల్లా’ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ మరోసారి ఉద్యమ వేదికగా మారింది. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారం కోసం ‘హుజురాబాద్ పీవీ జిల్లా సాధన సమితి’ మరియు జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద భారీ ఎత్తున నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం “హుజురాబాద్ జిల్లా కావాలి.. పీవీ జిల్లా వర్ధిల్లాలి” అనే నినాదాలతో మారుమోగింది. రాజకీయాలకు అతీతంగా అశేష జనవాహిని ఈ శిబిరానికి తరలివచ్చి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
13 మండలాలతో నూతన జిల్లా..
ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి కన్వీనర్ బిమోజు సదానందం(Bimoju Sadanandam) మాట్లాడుతూ.. హుజురాబాద్ ప్రాంతానికి జిల్లా కావాల్సిన అన్ని భౌగోళిక, చారిత్రక మరియు పరిపాలనాపరమైన అర్హతలు ఉన్నాయని ఘంటాపథంగా చెప్పారు. గత ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసమే హుజురాబాద్ కంటే చిన్న ప్రాంతాలను జిల్లాలుగా మార్చాయని, కానీ ఈ గడ్డను మాత్రం దారుణంగా విస్మరించాయని ఆయన ఆరోపించారు. పరిపాలన ప్రజల ముంగిటకు రావాలంటే హుజురాబాద్ జిల్లా ఏర్పాటు అనివార్యమని, హుజురాబాద్ కేంద్రంగా శంకరపట్నం, సైదాపూర్(Sydapur), జమ్మికుంట(Jammikunta), ఇల్లంతకుంట(Illantha KUnta), కమలాపూర్(Kamalapur), ఎల్కతుర్తి, వేలేరు, భీమదేవరపల్లి, టేకుమట్ల, మొగుల్లపల్లి, చిట్యాల మండలాలను కలుపుతూ మొత్తం 13 మండలాలతో నూతన జిల్లాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Also Read: Free Bus for Men: పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అన్నాడీఎంకే
రాజకీయ డిమాండ్ కాదు
దీక్షలో పాల్గొన్న జేఏసీ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, పొడిశెట్టి వెంకటరాజం మాట్లాడుతూ.. తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narsimha Rao) పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం ఈ ప్రాంతానికి గౌరవమని, ఇది కేవలం రాజకీయ డిమాండ్ కాదని, ఐదు లక్షల మంది ప్రజల ఆత్మగౌరవ సమస్య అని పేర్కొన్నారు. బండ శ్రీనివాస్, వేల్పుల రత్నం మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం చల్లూరు, వావిలాల, ఉప్పల్ గ్రామాలను తక్షణమే కొత్త మండలాలుగా గుర్తించాలని, జమ్మికుంట మరియు ఎల్కతుర్తి ప్రాంతాలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు తమ పనుల కోసం మైళ్ల దూరం ప్రయాణించలేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మొండివైఖరి వీడి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
జిల్లా సాధించే వరకు పోరాటం
ఈ కార్యక్రమంలో కళాకారులు రామ్ రాజేశ్వర్, భరత్ తమ ఉద్యమ గీతాలతో సభికులలో స్ఫూర్తిని రగిలించారు. జిల్లా సాధించే వరకు పోరాటం ఆగదని, రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ప్రజా ఉద్యమంగా మారుస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేల్పుల ప్రభాకర్, రవీందర్ రావు, ప్రభాకర్ రావు, జగన్నాథం, సాదుల రవీందర్ బాబు, మాడుగుల ఓదేలు, పంజాల రవీందర్ గౌడ్, మోటం రామ్ కుమార్, సందెల వెంకన్న, ఖాలీద్, బండ అశోక్, ధనవర్ష రాజు, శిరీష తదితరులతో పాటు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు, సీనియర్ జర్నలిస్ట్లు మండల యాదగిరి, పరంకుశం కిరణ్ కుమార్, చిలకమారి సత్యరాజ్, ఇప్పకాయల సాగర్ తదితరులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.

