BJP Group Politics: భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. (BJP)బీజేపలో గ్రూప్ పాలిటిక్స్ పై ఒక ఎంపీ వ్యాఖ్యలు ఒకలా ఉంటే మరో ఎంపీ వ్యాఖ్యలు మరోలా ఉండటం గమనార్హం. గ్రూప్ వార్ పై బీజేపీ(BJP) ఎంపీల భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. (BJP)బీజేపీలో కాకులు, గద్దలు ఉన్నాయని, పొడుచుకు తింటున్నారని ఇటీవల ఈటల రాజేందర్ (Etela Rajender) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా ఇదే అంశంపై ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సైతం స్పందించారు. కానీ ఆయన మరోలా వ్యాఖ్యానించడం గమనార్హం. బీజేపీలో ఆ ఇద్దరు ఎంపీలు కీలకమే కావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
భిన్న స్వరాలు వినిపిండం హాట్ టాపిక్
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలంగాణ (BJP)బీజేపీలో ఇప్పుడు గ్రూపు వార్ పై భిన్న స్వరాలు వినిపిండం హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన వేళ పార్టీలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, భిన్న స్వరాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ‘పాత-కొత్త’ నేతల మధ్య సమన్వయ లోపం ఇప్పుడు బహిరంగ వ్యాఖ్యల రూపంలో బయటపడుతోంది. ఇదిలా ఉండగా పార్టీలో వర్గపోరుపై స్పందిస్తూ ఆ కీలక నేతలిద్దరూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లో పోటీ ఉన్నప్పుడు ఆ తరహా గ్రూపు రాజకీయాలు ఉండటంలో తప్పేముందిదని అర్వింద్ సమర్థించుకోవడం విశేషం. అయితే, ఈ ధోరణి పార్టీ మనుగడకే ముప్పు అని ఈటల ఇటీవల వ్యాఖ్యానించారు. గ్రూపుల వల్ల పార్టీ పటిష్టత దెబ్బతింటుందని, ఇది కార్యకర్తల్లో గందరగోళానికి దారితీస్తుందని ఈటల హెచ్చరించడం గమనార్హం.
ఈటల చేసిన వ్యాఖ్యలు దుమారం
తెలంగాణ బీజేపీలో ఏళ్లుగా జెండా మోసిన పాత నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన కొత్త నేతల మధ్య దూరం మరింత పెరిగింది. ఈ క్రమంలో ఈటల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కొత్తగా వచ్చిన నేతలను కాకులు, గద్దల్లాగా కొందరు ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంలేదనే భావన కొత్త నేతల్లో బలంగా ఉంది. తాము పార్టీ కోసం కష్టపడుతున్నా పరాయి వారిలానే చూస్తున్నారని కొత్త నేతలు వాపోతున్నారు. ఇక వెన్నుపోటు రాజకీయంపై నేతల మధ్య జరుగుతున్న రచ్చ పరాకాష్టకు చేరింది. తనను కాకులు.., గద్దల్లా పొడుస్తున్నారంటూ ఈటల వ్యాఖ్యానించగా.., అందుకు అర్వింద్ కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుతోంది. తనను ఎవరూ పొడవలేదని చెప్పుకొచ్చారు.
బీజేపీ నేతలు సొంత గూటిలోనే యుద్ధం
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తుంటే, రాష్ట్ర స్థాయి నేతల మధ్య నెలకొన్న ఈ విభేదాలు కార్యకర్తలను నిరుత్సాహపరుస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ బలోపేతం అవుతుంటే, మరోవైపు బీజేపీ నేతలు సొంత గూటిలోనే యుద్ధం చేసుకోవడం ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ‘గ్రూపు’ యుద్ధానికి హైకమాండ్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి. నేతల మధ్య ఈ భిన్న స్వరాలు ఇలాగే కొనసాగితే, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఫలితాలపై అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

