Gaddam Prasad Kumar: ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారేనని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, (Kale Yadiah) పోచారం శ్రీనివాస్ రెడ్డిలు (Pocharam Srinivas Reddy) పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. వీరిద్దరినీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు ఆయన తీర్పు వెలువరించారు. వారిద్దరికీ క్లీన్‌చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలపై పలు సార్లు విచారణ చేపట్టారు. ఇరు పక్షాల వాదోపవాదనలను స్పీకర్ విన్నారు. ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు అందజేసిన పలు వీడియోలు.. డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈనెల 15న స్పీకర్ ఇద్దరు ఎమ్మెల్యేలపై తీర్పు ఇచ్చారు. వీరు పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామని స్పీకర్ ప్రకటించారు.
స్పీకర్ ఇదే తరహా తీర్పు
పార్టీ ఫిరాయింపులను పదిమంది ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు. గతంలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు ఎమ్మెల్యేల గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి (గద్వాల), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)ల అంశంలో స్పీకర్ ఇదే తరహా తీర్పును వెలువరించారు. పార్టీ మారినట్లు వారిపై ఆధారాలు లేకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Also Read: Gaddam Prasad Kumar: శారీరక వ్యాయామమే కాదు.. ఒక జీవన విధానం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
కేసు ప్రస్తుతం పెండింగ్
అయితే మరో ముగ్గురు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్( ఖైరతాబాద్), కడియం శ్రీహరి( స్టేషన్ ఘన్పూర్ ), సంజయ్( జగిత్యాల)లకు సంబంధించిన కేసు ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఇప్పటికే విచారణ పూర్తయింది. ఈ తీర్పును రిజర్వు చేసి ఉంచారు. అయితే, ఎమ్మెల్యే సంజయ్ విషయానికి వచ్చేసరికి తగిన ఆధారాలు లేవనిస్పీకర్.. ఆయనకు సైతం క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
మరో ఇద్దరిపై సస్పెన్స్
మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం గతంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. కడియం శ్రీహరి మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే సుప్రీంకోర్టు మరో రెండు వారాల్లో ఆ ముగ్గురిపై నిర్ణయం తీసుకోవాలని గడు ఇవ్వడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాం అనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాను కాంగ్రెస్లో ఉన్నట్లు ప్రకటించిన దానం నాగేందర్ పై వేటు వేస్తారా?.. లేదా అనేది చూడాలి. నాగేంద్ర పై వేటుపడితే మాత్రం ఖైరతాబాద్ కు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.

