CM Revanth Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేసి, ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మారుస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్‌లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన పాల్గొని, జిల్లాకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. జిల్లా ప్రజలకు చిరకాలం సేవలందించిన ఇద్దరు నేతలను స్మరించుకుంటూ చనాక-కొరటా ప్రాజెక్టుకు సీ. రామచంద్రా రెడ్డి పేరును, సదర్మట్ బ్యారేజీకి మాజీ మంత్రి నర్సారెడ్డి పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తుమ్మిడిహట్టి ద్వారా జిల్లా సస్యశ్యామలం
ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల లోపు దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. గోదావరిలోని ప్రతి చుక్కను ఒడిసిపట్టి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు.బాసర ఐఐటీలో ‘ఆదిలాబాద్ యూనివర్సిటీ’ జిల్లాకు యూనివర్సిటీ మంజూరైనా స్థల వివాదాల వల్ల జాప్యం జరిగిందని, ఇకపై ఆ పరిస్థితి ఉండదని సీఎం తెలిపారు. బాసర ఐఐటీ ప్రాంగణంలోనే యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు సూచించారు.
Also Read: CM Revanth Reddy: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. పది శాతం జీతం కట్: సీఎం రేవంత్ రెడ్డి
పారిశ్రామిక విప్లవం -ఎయిర్ పోర్టు ఏర్పాటు
ఎర్రబస్సు తిరగన ఆదిలాబాద్‌లో ఎయిర్ బస్సు తిరిగేలా చేస్తాం అని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు, 10 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడతాం” అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలవడానికి కూడా వెనుకాడనని, అయితే అది కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే తప్పా ..తన వ్యక్తిగత ఎజెండా కాదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర నిధుల సాధనలో బీజేపీ ప్రతినిధులు కూడా సహకరించాలని కోరారు.సంక్షేమ పథకాల అమలు తమ ప్రభుత్వం పేదల ఎజెండాతో నడుస్తోందని,ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, సన్నాలకు బోనస్. రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆరు గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు.గతాన్ని తవ్వుకుంటూ కూర్చోనని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

