Medaram Jatara 2026: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు కాంగ్రెస్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు తల్లుల దర్శనానికి రానున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. భక్తుల సౌకర్యం, సుభిక్ష దర్శనం ప్రథమ ప్రాధాన్యతగా మారింది. సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో, ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు కలిసి సమగ్ర ప్రణాళికతో పని చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ జాతర కోసం మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం, పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరికి అదనంగా 2 వేల మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా తమ సేవలు అందించనున్నారు.
మొబైల్ నెట్‌వర్క్‌కు అంతరాయం కలగకుండా 27 శాశ్వత టవర్లతో పాటు తాత్కాలిక పద్దతిలో 33 మొబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా, 42 సెక్టర్లుగా విభజించారు. ఒక్కో జోన్‌కు జిల్లా స్థాయి అధికారి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. ఒక్కో సెక్టార్‌కు మండల స్థాయి అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్న వాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాంసాగర్, నర్లాపూర్, పడిగాపూర్ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూములు, మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, అత్యవసర స్పందన బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
రవాణా వ్యవస్థ బలోపేతం
భక్తుల రాకపోకల్లో ఇబ్బందులు రాకుండా మొత్తం 525 చోట్ల రహదారి సమస్యలను గుర్తించి పరిష్కరించారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మతులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. వాహనాల రద్దీ తగ్గించేందుకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ ప్రాంతాలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా నిరంతరం తాగునీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 5,482 తాగు నీటి నల్లాలు ఏర్పాటు చేసి భక్తులకు శుద్ధమైన నీటిని అందిస్తున్నారు.
119 డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు
జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసే భక్తుల కోసం 119 డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేశారు. 285 బ్లాకుల్లో 5,700 టాయిలెట్లను సిద్దం చేశారు. వీటికి అదనంగా మొబైల్ టాయిలెట్స్‌ను అందుబాటులోకి తేనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 5 వేల మంది సిబ్బందిని, 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మిషిన్లు, 12 జేసీబీ, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు. జాతర ప్రాంతంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా టీజీఎన్‌పీడీసీఎల్ ద్వారా 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, 65.75 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా 350 మంది సిబ్బందిని నియమించారు. ఆలయాలు, ప్రధాన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో వేల సంఖ్యలో హై పవర్ లైట్లు వెలుగులు పంచుతుండగా, అత్యవసర పరిస్థితుల కోసం 28 డీజిల్ జనరేటర్లు బ్యాకప్‌గా సిద్ధంగా ఉన్నాయి.
Also Read: Medaram Jatara 2026: సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని… కీలక ఆదేశాలు జారీ చేసిన మల్టీ జోన్ ఐజీ
మేడారానికి 4వేల బస్సులు
భక్తులు సులభంగా మేడారానికి చేరుకునేందుకు టీజీఆర్టీసీ ఈసారి 4000 బస్సులను వినియోగంలోకి తెచ్చి 51,000 ట్రిప్పులు నిర్వహిస్తోంది. ప్రత్యేక బస్టాండ్లు, ప్రత్యేక రూట్లతో రవాణా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహిస్తున్నారు. జాతర కోసం 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది సేవలందించనున్నారు. గంటకు 15 బస్సులు ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు.
5,192 మంది వైద్య సిబ్బంది
జాతర సమయంలో ఆరోగ్య సేవల కోసం మొత్తం 5,192 మంది వైద్య సిబ్బందిని నియమించారు. భక్తులకు సేవలందించేందుకు 30 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు, 50 పడకల ప్రధాన ఆస్పత్రి, రోజుకు 30 మెడికల్ క్యాంపులు పనిచేస్తాయి.
ప్రమాదాల నివారణకు సిబ్బంది
జంపన్నవాగులో ప్రమాదాలను నివారించేందుకు 210 మంది గజ ఈతగాళ్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ సిబ్బంది, 100 బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు 15 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు, 268 మంది ఫైర్ ఫైటర్లు సిద్ధంగా ఉన్నారు. అటవీ శాఖ ద్వారా పార్కింగ్, రోడ్లతో పాటు పర్యావరణ సంరక్షణ చేపడుతుండగా, ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు కొబ్బరి కాయ, బెల్లం, ఇతర వ్యాపారాల కోసం లైసెన్సులు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. మొత్తంగా మేడారం మహాజాతరను ప్రపంచ స్థాయిలో నిర్వహించాలనే లక్ష్యంతో, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు త్వరితగతిన తల్లుల దర్శనం, సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది.
Also Read: Medaram Jatara 2026: మేడారం జాతరపై ఆరోగ్య శాఖ స్పెషల్ ఫోకస్.. 30 మెడికల్ క్యాంపుల ఎర్పాటుతో పాటు..?

