Seethakka: సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలని మంత్రులు సీతక్క, (Seethakka) అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Lakshman Kumar) అధికారులకు సూచించారు. రూ.250 కోట్లకుపైగా నిధులతో పనులు చేపడుతున్నామన్నారు. ఈనెల 28 నుంచి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి దాదాపు 3 కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మేడారం జాతరపై సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంనిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ గత 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, ఈసారి 2026 లో జాతరకు దాదాపు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని వివరించారు.
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి
సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడం ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకుని, ఏ చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి, జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్ మ్యాప్‌లతో పాటు అవసరమైన చోట వన్‌వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు.
Also Read: Seethakka Meets KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. కారణం ఏంటంటే?
ఆ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం
ఈ జాతరపై క్యాబినెట్ మొత్తం ప్రత్యేక దృష్టి సారించిందని, మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇలాంటి స్థాయి సమిష్టి పర్యవేక్షణ గతంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకుగాను డ్రోన్ లను ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా, జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను క్యూ.ఆర్ కోడ్ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు. జాతర పనుల పురోగతి పై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను ఆవిష్కరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తదితర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Seethakka: ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర : మంత్రి సీతక్క

