Godavari River: సుప్రీంకోర్టులో తెలంగాణ రిట్ పిటిషన్‌పై వాదనల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని అది పూర్తయితే దక్షిణ భారతంలో ఏ రాష్ట్రమూ ఏపీతో పోటీ పడలేదని అన్నారు. అమరావతిలో హెచ్‌ఓడీలు, సెక్రెటరీలతో సమావేశం సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నదని చెప్పారు. వాటిని వాడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడంతోపాటు, శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నామని వివరించారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎవరికీ నష్టం లేదని, ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని అడిగారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని, తాను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చని, పుష్కరాల లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్.. పల్లె ప్రకృతి వనంలో మృత్యుపాశాలు తొలగింపు!
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సుప్రీం కోర్టులో సోమవారం జరిగిన కేసు విచారణకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్ 131, సివిల్ సూట్ రూపంలో ఈ వివాదంపై మళ్లీ రావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారని చెప్పారు. దాంతో ఇంతకు ముందు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలుమార్లు ఉల్లంఘనలకు పాల్పడిన విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. స్టాప్ వర్క్ ఆర్డర్‌ను అమలు చేయడం లేదనే విషయాన్ని కూడా తెలియజేశామన్నారు. కేటాయించిన 484.5 టీఎంసీలకన్నా ఎక్కువగా జలాలను ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కూడా కోర్టుకు తెలిపామన్నారు. గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళుతున్న విషయాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ముందుగా డిజైన్ చేసిన దానికన్నా అదనంగా ఏం చేయడానికి వీలు లేదని వాదనలు వినిపించామని ఉత్తమ్ వివరించారు.
Also Read: Chinese Manja: చైనా మాంజ చుట్టుకుని పోలీసు మెడకు తీవ్ర గాయం.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

